రాజస్థాన్‌లో సచిన్ వర్సెస్‌ గెహ్లాట్‌

31 May, 2018 15:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి రాజస్థాన్‌లో పార్టీ వ్యవహారాలు చికాకు పెడుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించి అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యానికి పార్టీ సీనియర్‌ నేతల వ్యవహార శైలి హైకమాండ్‌కు మింగుడుపడటం లేదు. మాజీ సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌, రాజస్థాన్‌ పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌కు వ్యతిరేకంగా అసమ్మతిని ప్రోత్సహిస్తుండటం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. రెండు లోక్‌సభ ఉప ఎన్నికలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ విజయంతో ఈసారి రాజస్థాన్‌పై కాంగ్రెస్‌ భారీ ఆశలు పెట్టుకుంది. రెండు సార్లు సీఎంగా వ్యవహరించిన అశోక్‌ గెహ్లాట్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించింది.

గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య నెలకొన్న విభేదాలపై అసహనంతో ఉన్న రాహుల్‌ ఇటీవల వీరితో వేర్వేరుగా సమావేశమై సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రాజస్థాన్‌ వ్యవహరాల్లో తలదూర్చవద్దని, జాతీయ రాజకీయాల్లో నిమగ్నం కావాలని గెహ్లాట్‌కు రాహుల్‌ తేల్చిచెప్పారు. అనంతరం రాజస్థాన్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ అవినాష్‌ పాండే, గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌లతో ఉమ్మడిగానూ భేటీ అయ్యారు. పార్టీ గ్రూపులన్నింటినీ ఏకతాటిపై నడిపిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చాలని సచిన్‌ పైలట్‌కు రాహుల్‌ స్పష్టం చేసినట్టు సమాచారం.

మరోవైపు గెహ్లాట్‌ సీఎంగా ఉన్న సమయంలో పాండేతో సన్నిహిత సంబంధాలున్నందున పాండేను రాజస్ధాన్‌ ఇన్‌ఛార్జ్‌గా తప్పించాలన్న పైలట్‌ సూచనను రాహుల్‌ తోసిపుచ్చారు. ఇక రాజస్థాన్‌ సీఎంగా మరోసారి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని గెహ్లాట్‌ కోరుతున్న క్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు దూరంగా వెళ్లేందుకు ఆయన నిరాకరిస్తున్నారు.

కాగా గెహ్లాట్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే రాజస్ధాన్‌లో పార్టీ గెలుపొందుతుందని, లేనిపక్షంలో మరోసారి బీజేపీ అధికార పగ్గాలు అందుకుంటుందని గెహ్లాట్‌ గ్రూప్‌ నేతలు నేరుగా ఢిల్లీలో అధిష్టానం వద్దే కుండబద్దలు కొట్టడంతో పార్టీ తలనొప్పులు ఎదుర్కొంటోంది. రాజస్థాన్‌లో పార్టీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి రేసుకు దూరంగా ఉండేందుకు గెహ్లాట్‌ సుముఖంగా లేరు. రాజస్థాన్‌లో పార్టీ గ్రూపు రాజకీయాలను అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందని కాంగ్రెస్‌ శ్రేణులు వేచిచూస్తున్నాయి.

మరిన్ని వార్తలు