ముందు ముందు మరిన్ని నిజాలు

26 Sep, 2018 01:41 IST|Sakshi

రాఫెల్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపణల తీవ్రత పెంచారు. రాఫెల్‌ ఒప్పందంతోపాటు విజయ్‌మాల్యా తదితరులకు సంబంధించిన మరికొన్ని నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. సొంత నియోజకవర్గం అమేథీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమేథీలో కూడా హెచ్‌ఏఎల్‌ ప్లాంట్‌ ఉంది. ‘ప్రభుత్వ రంగ సంస్థకు దక్కాల్సిన రాఫెల్‌ కాంట్రాక్టును అంబానీకి కట్టబెట్టడం వల్ల హెచ్‌ఏఎల్, యువత అవకాశాలను లాగేసుకున్నారనే విషయాన్ని గ్రహించాలి. నిజాన్ని మీకు చెబుతున్నా. ఏది న్యాయమో మీరే నిర్ణయించండి’ అని అన్నారు.

తన సన్నిహిత మిత్రుల జేబులు నింపేందుకే ప్రధాని మోదీ రాఫెల్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపించారు. లోక్‌పాల్‌ అంబుడ్స్‌మెన్‌ నియామకంలో జాప్యానికి రాఫెల్‌ వివాదంపై ప్రధాని మోదీ మౌనమే కారణమని రాహుల్‌ ఆరోపించారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా అచ్చే దిన్‌(మంచి రోజు)ను ఎప్పటికీ తేలేకపోయినా కనీసం సచ్చే దిన్‌(నిజమైన రోజు) వచ్చేలా ఈ ఒప్పందంలో నిజాలను వెల్లడించాలని మోదీని డిమాండ్‌ చేశారు. దోపిడీ దారులను చట్టం ముందు నిలబెడతానంటూ ట్విటర్‌లో వివిధ వర్గాల ప్రజలకు హామీ ఇచ్చారు. ‘సైనిక జవాన్లు, ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు, అమరవీరుల కుటుంబాలతోపాటు హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) సిబ్బంది ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వారిని దోచుకుని, అవమాన పరిచిన వారిని దోషులుగా నిలబెడతా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

‘కాపలాదారుగా ఉంటానని చెప్పి అంబానీ జేబును రూ.30వేల కోట్లతో నింపారు. మీరు దేశానికా లేక అంబానీకి ప్రధానా? ఇప్పటివరకు ఆలీబాబా 40 నలబై దొంగల కథ విన్నాం. మోదీ బాబా, 40 దొంగలు ఏం సమాధానం చెబుతారని ఇప్పుడు అడుగుతున్నాం’ అని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. దేశంలో ఎన్నడూ జరగనంతటి పెద్ద కుంభకోణం ఇది అని మరో నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. హెచ్‌ఏల్‌ను పక్కనబెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం? దాని నుంచి ఎవరు లబ్ధి పొందారు?. తను ఇష్టం వచ్చినట్లుగా చేయడానికే ప్రజలు అధికారం ఇచ్చినట్లు మోదీ అనుకుంటున్నట్లుంది. అది ఆమోదయోగ్యం కాదు’ అని సిబల్‌ అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు