పోయెస్‌ గార్డెన్‌లో ఐటీ దాడులు

18 Nov, 2017 02:17 IST|Sakshi

జయ, శశికళ గదుల్లో తనిఖీలు

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. న్యాయస్థానం అనుమతితో వారు ఈ దాడులు చేశారు.  శుక్రవారం రాత్రి ఐటీ అధికారుల బృందం పోయెస్‌ గార్డెన్‌కు చేరుకుంది. అంతకముందే శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జయ టీవీ సీఈవో వివేక్‌కు ఫోన్‌ చేసి వేద నిలయం తాళాలు తీసుకుని రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన అధికారులు జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో తనిఖీలు చేపట్టారు.

శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి ఒక లాప్‌టాప్, నాలుగు పెన్‌ డ్రైవ్‌ల కోసం ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. పూంగున్రన్‌ గది, రికార్డుల గది, శశికళ వాడిన గదుల్లో మాత్రమే సోదాలు చేశామని ఐటీ అధికారి చెప్పారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేద నిలయం చుట్టుపక్కల భారీ భద్రత ఏర్పాట్లు చేసినా.. తనిఖీల విషయం తెలియగానే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకుని పోలీసులతో ఘర్షణ పడ్డారు.  దాడుల్ని శశికళ వర్గం తప్పుపట్టింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ మాట్లాడుతూ.. అమ్మ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.   

శశికళ భర్తకు రెండేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్‌ అని చెప్పి కస్టమ్‌ శాఖను మోసగించిన కేసులో శశికళ భర్త నటరాజన్‌కు సీబీఐ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో శశికళ అక్క కుమారుడు భాస్కరన్‌తో పాటు మరో ఇద్దరికి కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది.  1994 సెప్టెంబర్‌ 6వ తేదీన నటరాజన్‌ లండన్‌ నుంచి లెక్సెస్‌ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్‌ పేరిట దిగుమతి చేసుకున్నారు.

మరిన్ని వార్తలు