పెరిగిన రైల్వే చార్జీలు

1 Jan, 2020 04:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త సంవత్సర ప్రారంభ రోజు నుంచే రైలు చార్జీలను పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. సబర్బన్‌ రైళ్లు తప్ప మిగిలిన అన్ని రకాల రైళ్లలో 2020 జనవరి 1 నుంచి చార్జీలు పెరగనున్నట్లు తెలిపింది. రోజూ సబర్బన్‌ రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని ఆ రైళ్లలో చార్జీలు పెంచట్లేదని తెలిపింది. సాధారణ నాన్‌ ఏసీ, నాన్‌ సబర్బన్‌ రైళ్లలో కిలోమీటరుకు 1 పైసా, మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ నాన్‌ ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు, ఏసీ క్లాసులకు కిలోమీటరుకు 4 పైసలు పెరిగాయి.

ప్రీమియం రైళ్లైన శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని చెప్పింది. ఢిల్లీ–కోల్‌కతాల మధ్య 1,447 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రాజధాని రైల్లో కిలోమీటరుకు 4 పైసలు పెరగడంతో టికెట్‌ చార్జీకి రూ. 58 కలవనుంది. అయితే ఇప్పటికే బుక్‌ చేసిన టికెట్ల రిజర్వేషన్‌ ఫీజు, సూపర్‌ఫాస్ట్‌ చార్జీ వంటి వాటికి ఈ పెంపు వర్తించదని చెప్పింది. 7వ వేతన కమిషన్‌ భారం రైల్వేశాఖపై పడడంతో చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.  కాగా, రైల్వేబోర్డు చైర్మన్‌గా వీకే యాదవ్‌ మరో ఏడాదిపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్‌ నియామక మండలి ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

ఆర్పీఎఫ్‌ పేరు మార్చిన రైల్వేశాఖ
రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్‌) పేరును భారత రైల్వే భద్రతా దళం సర్వీస్‌గా (ఐఆర్‌పీఎఫ్‌ఎస్‌) మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వ్యవస్థీకృత గ్రూప్‌–ఏ హోదా కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు