రైళ్లలో ఇక సర్వీస్‌ కెప్టెన్లు !

6 Mar, 2018 04:13 IST|Sakshi

ప్రయాణికుల సదుపాయాలకు సింగిల్‌ విండో పథకం

రైల్వే కమిటీ సిఫారసులు

రైలు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. టాయిలెట్‌లో నీళ్లు రావు.. ఏఅర్ధరాత్రో హఠాత్తుగా ఫ్యాన్‌ ఆగిపోతుంది. ఎలుకలు, బొద్దింకలు వంటి జీవజాలం భయపెడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన సమస్యని ఎవరికి చెప్పుకోవాలి ?  ఈ సమస్యలన్నింటిని పరిష్కరించడానికి రైల్వే శాఖ సన్నద్ధం అవుతోంది.. ప్రయాణికులే సౌకర్యమే లక్ష్యంగా సమూలంగా మార్పులు తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం ప్రతీ మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సర్వీస్‌ కెప్టెన్‌ను నియమించాలని యోచిస్తోంది. రైలు ప్రయాణికులకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఇక నుంచి సర్వీస్‌ కెప్టెన్‌దే . ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ నేతృత్వంలోని రైల్వే కమిటీ సిఫారసులు చేసింది.. రైళ్లలో పరిశుభ్రత, ప్రయాణికులకు కావల్సిన సౌకర్యాలు, బెర్త్‌ల సర్దుబాటు, ప్రయాణికులు చేసే ఇతర ఫిర్యాదులు అన్నింటికి సింగిల్‌ విండో పద్ధతిలో పరిష్కారం చూపిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించవచ్చునని కమిటీ అభిప్రాయపడింది. తన నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది.

ప్రస్తుతం రైల్వేలో ఒక్కో సర్వీసుకి ఒక్కొక్కరిని కాంటాక్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది.. దీంతో ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీక ప్రయాణికులు గందరగోళానికి లోనవుతున్నారు. ప్రతీ దానికి టీటీఈనే ఆశ్రయిస్తున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. అందుకే సమస్యల పరిష్కారానికి సింగిల్‌ ఇన్‌చార్జ్‌ని నియమించాలని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది.

గతంలో రైల్వే మంత్రిగా ఉన్న సురేష్‌ ప్రభు ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ట్విట్టర్‌లో ఫిర్యాదుల్ని స్వీకరించారు.. అయితే లెక్కకు మించి వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించలేక రైల్వే సిబ్బంది చేతులెత్తేశారు. అందుకే ప్రతీ రైలులో యూనిఫామ్‌ ధరించిన సర్వీసు కెప్టెన్‌ను నియమిస్తే ప్రయాణికుల ఫిర్యాదులు పరిష్కరించడం సులభం అవుతుందని రైల్వే కమిటీ అభిప్రాయపడింది.

సర్వీసు కెప్టెన్ల విధులు
ప్రయాణికులు సులభంగా సర్వీస్‌ కెప్టెన్‌ను గుర్తు పట్టేలా ప్రత్యేకంగా యూనిఫామ్‌ ఇవ్వాలి.. రైళ్లలో పరిశుభ్రత, మరమ్మతులు, కోచ్‌ మెయింట్‌నెన్స్, బెర్త్‌ సర్దుబాటుకు సంబంధించిన సమస్యలు, ఎలుకలు, బొద్దింకలువంటి సమస్యలు, ప్రయాణికులకు ఎదురయ్యే ఇతర సమస్యలను పరిష్కరించే బాధ్యత సర్వీసు కెప్టెన్లదే. వారి కింద కొందరు సూపర్‌వైజర్లు కూడా ఉంటారు. ప్రయాణికులు ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఒకేసారి అన్ని రైళ్లల్లో సర్వీసు కెప్టెన్లను నియమించాలంటే సిబ్బంది కొరత ఉంటుంది కాబట్టి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన పది రైళ్లలో వీరిని నియమించాలని కమిటీ తన సిఫారసుల్లో పేర్కొంది.

లగ్జరీ రైళ్లలో 50 శాతం చార్జీల తగ్గింపు?
ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్, రాయల్‌ రాజస్థాన్, మహరాజా ఎక్స్‌ప్రెస్, గోల్డెన్‌ చారియెట్‌ వంటి రైళ్లలో టిక్కెట్‌ చార్జీలను 50 శాతం తగ్గించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.. ఈ టిక్కెట్‌ చార్జీలు ఎగువ మధ్యతరగతికి కూడా అందుబాటులో లేవని భావిస్తున్న రైల్వే శాఖ సగానికి సగం తగ్గించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ రేటు గణనీయంగా పడిపోయింది. విదేశీ ప్రయాణికులు కూడా ఈ రైళ్లలో ప్రయాణానికి ముందుకు రాకపోవడంతో చార్జీల తగ్గింపు తప్ప మరో మార్గం లేదని రైల్వే శాఖ నిర్ణయానికి వచ్చినట్టు సమచారం

10 లక్షల కోట్ల హె స్పీడ్‌ రైళ్ల కారిడర్లు
దేశంలో అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్‌ రైల్వే కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. భారతమాల హైవే అభివృద్ధి కార్యక్రమం కింద10 వేల కిలో మీటర్ల కారిడర్లను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఇందుకోసం 10లక్షల కోట్ల నిధుల్ని కేటాయించాలని భావిస్తోంది.
తక్కువ ఆక్యుపెన్సీ రైళ్ల రద్దు
రైల్వే శాఖలో సమూల ప్రక్షాళనకు రైల్వే కమిటీ మరిన్ని సిఫారసులు చేసింది.
ప్రయాణికుల సామర్థ్యం తక్కువ ఉన్న పలు రైళ్లను రద్దు చేయాలి.
స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని తగ్గించడం ద్వారా సరైన సమయానికి రైళ్లు గమ్యస్థానం చేరేలా చూడాలి
ఆర్థికంగా అంతగా లాభం లేని పలు చిన్న స్టేషన్లలో రైళ్ల హాల్ట్‌లను రద్దు చేయాలి
సబర్బన్, మెయిన్‌ లైన్‌ కారిడార్‌లను, గూడ్స్‌ కారిడార్‌ను వేరు చేయాలి
అన్ని రైల్వే జోన్లలో ఆటోమేటిక్‌ సిగ్నల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి
పాదచారులు, వాహనాలు, ఆవుల మందలు ట్రాక్స్‌పైకి రాకుండా నిరోధించడానికి ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయాలి.

మరిన్ని వార్తలు