జూలై 11 నుంచి కేంద్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె

24 Jun, 2016 20:29 IST|Sakshi

- ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య
- జంతర్‌మంతర్‌లో భారీ ఎత్తున ధర్నా


న్యూఢిల్లీ : వచ్చే నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రైల్వే కార్మికులు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మా 11 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ జంతర్‌మంతర్‌లో రైల్వే, రక్షణ, తపాలా, తదితర కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో ధర్నా నిర్వహించాం. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. జులై 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తాం. జులై 11లోగా కేంద్రం సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తే సమ్మెపై పునరాలోచిస్తాం. రైల్వే సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాం.

కష్ట పరిస్థితుల్లో కూడా భారత రైల్వేను ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపాం. మాతో చేసుకున్న ఒప్పందాలను అమలుచేయడంలో రైల్వే శాఖ విఫలమైంది. ఏడో పీఆర్సీతో మాకు అన్యాయం చేశారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాల్సి ఉంది. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. ఉమ్మడిగా 32 లక్షల మంది కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొంటారు. ప్రభుత్వం మాతో సంప్రదింపులకు రావాలి. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సమ్మెను అణచివేసేలా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తాం..' అని పేర్కొన్నారు. రైల్వేలో కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని, రైల్వే ప్రైవేటీకరణకు అనుమతించరాదని తదితర డిమాండ్లతో సమ్మె చేపడుతున్నట్టు వివరించారు. బోనస్ పెంచాలని, కార్మికుడి పదవీకాలంలో 5 పదోన్నతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సంస్కరణలను నిలిపివేయాలని కోరారు.

మరిన్ని వార్తలు