అబ్బాయిగా కంటే.. అమ్మాయిగా జీవించడమే ఇష్టం..!

23 Jul, 2019 19:59 IST|Sakshi
రాజేష్‌ పాండే ఆలియాస్‌ సోనియా పాండే

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ఉన్నతాధికారులకు వింత అనుభవం ఎదురైంది. నివాసం మారినప్పుడు, మరేదైనా కారణాలతో కార్యాలయ రికార్డుల్లో మార్పులు చేయాలని మాత్రమే తెలిసిన వాళ్లకు.. తాజాగా జెండర్‌ మార్చాలని విజ్ఞప్తి వచ్చింది. అతను కాస్తా.. ఆవిడగా మారడమే దీనికి కారణం. వివరాలు.. రాజేష్‌ పాండే (35) తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి 2003లో చనిపోవడంతో కారుణ్య నియామకం కింద రాజేష్‌ రైల్వేలో ఉద్యోగం పొందాడు. రైల్వే వర్క్‌ షాప్‌లో గ్రేడ్‌-1 టెక్నీషియన్‌గా చేరాడు. నలుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడైన రాజేష్‌కు చిన్నప్పటి నుంచి స్త్రీగా ఉండటమే ఇష్టం.

దాంతో 2017లో రాజేష్‌ లింగమార్పిడి చేయించుకుని, సోనియా పాండేగా పేరు మార్చుకోవడం జరిగింది. అందరూ సోనియా అని పిలుస్తున్నా.. ఆఫీస్‌ రికార్డుల్లో మాత్రం ఇంకా రాజేష్‌ పాండే అనే ఉంది. దీంతో రికార్డుల్లో జెండర్‌ పేరు మార్చాలని గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ను రాజేష్‌ అలియాస్‌ సోనియా కలిసింది. ఆ దరఖాస్తును హుండ్లీలోని రైల్వే బ్రాంచ్‌కు పంపించారు. రికార్డుల్లో పేరు, లింగం మార్చాలని కోరతూ దరఖాస్తు రావడం ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. లింగ మార్పిడి చేసుకోవడానికి ముందే రాజేష్‌కు స్థానికంగా ఉండే ఓ యువతితో  పెళ్లైంది. కానీ, అసలు విషయం బయటపడటంతో విడాకులు తప్పలేదు. భార్యకు తన శరీర స్వభావం గురించి చెప్పి విడాకులు తీసుకున్నానని, లింగ మార్పిడి అనంతరం అమ్మాయిగా జీవించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సోనియా పాండే.

మరిన్ని వార్తలు