కరోనా పాజిటివ్‌: వివరాలు దాచి గెస్ట్‌హౌజ్‌లో..

20 Mar, 2020 14:09 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

బెంగళూరు: మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అయితే ఓ రైల్వే అధికారిణి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. స్పెయిన్‌ నుంచి భారత్‌కు వచ్చిన తన కుమారుడి వివరాలు దాచిపెట్టారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో నిర్లక్ష్యంగా వ్యవరించిన సదరు అధికారిణిని రైల్వే శాఖ శుక్రవారం సస్పెండ్‌ చేసింది. వివరాలు... బెంగళూరుకు చెందిన ఓ మహిళ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. ఆమె కొడుకు(25) ఇటీవలే స్పెయిన్‌ నుంచి భారత్‌ వచ్చాడు. మార్చి 13న కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన తర్వాత అతడికి టెస్టులు నిర్వహించగా.. కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని గృహ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా సూచించారు.(భారత్‌లో 209కి చేరిన కరోనా కేసులు)

ఈ క్రమంలో అతడి తల్లి.. సదరు వ్యక్తిని ఇంటికి తీసుకువెళ్లకుండా రైల్వే శాఖకు చెందిన గెస్ట్‌హౌజ్‌లో ఉంచారు. అక్కడున్న వారికి అతడికి కరోనా సోకిన విషయం చెప్పకుండా దాచిపెట్టారు. ఈ క్రమంలో అతడి తీరుపై అనుమానం వచ్చిన కొంత మంది వ్యక్తులు నిలదీయగా అసలు విషయం బయటపెట్టాడు. ఈ విషయం గురించి రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ తన కొడుకు, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం.. ఆమె ఇతరుల జీవితాలను ఆపదలోకి నెట్టారు. ఆమెను సస్పెండ్‌ చేశాం’’ అని పేర్కొన్నారు. గెస్ట్‌హౌజ్‌లో అతడిని కలిసిన వాళ్లకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా దేశంలో మొదటిసారిగా కర్ణాటకలో కరోనా తొలి మరణం నమోదైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అక్కడ 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. దాదాపు 100 మంది ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నారు.  (చైనా గోప్యత వల్లే భారీ మూల్యం..)

మరిన్ని వార్తలు