బార్‌కోడింగ్‌ కార్డుల ద్వారా రైల్వే టికెట్లు

13 Jan, 2017 03:39 IST|Sakshi
బార్‌కోడింగ్‌ కార్డుల ద్వారా రైల్వే టికెట్లు

కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లపై పరిశీలిస్తున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌:
నగదు రహిత సేవల్లో భాగంగా ప్రీ పెయిడ్‌ కార్డుల ద్వారా టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కార్డులపై ఉండే బార్‌ కోడింగ్‌ ద్వారా వేగంగా ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉండటంతో ఆ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే రిజర్వేషన్‌ కౌంటర్లలో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) యంత్రాలను సమకూర్చి స్వైపింగ్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఇవే యంత్రాలను కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లలో కూడా అందుబాటులోకి తేవాలని ముందుగా నిర్ణయిం చారు.

స్వైపింగ్‌కు ఎక్కువ సమయం పడుతుం డటంతో వాటితో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ప్రస్తుతానికి వాటిని అందుబాటులోకి తేవద్దని నిర్ణయించారు. రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన తర్వాత చాలామంది హడావుడిగా వచ్చి టికెట్లు కొంటుంటారు. ఆ సమయంలో స్వైపింగ్‌ యంత్రాలలో లావాదేవీలు చేయటం వల్ల జాప్యం జరిగి రైళ్లను మిస్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో  కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లలో స్వైపింగ్‌ యంత్రాలు సరికాదని అధికారులు నిర్ణయించారు. వీటికి బదులు బార్‌కోడింగ్‌ ఉండే కార్డుల ద్వారా వేగంగా టికెట్లు జారీ చేయొచ్చని భావిస్తున్నారు. ఇందుకు ప్రజలకు బార్‌కోడింగ్‌ ఉండే ప్రీపెయిడ్‌ కార్డులను జారీ చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు