రైల్వే ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ

30 Jul, 2019 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వేల పనితీరు మెరుగుపరిచే దిశగా ఆ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరైన ప్రతిభ కనబరచని ఉద్యోగులను ముందస్తు పదవీ విరమణ ద్వారా తొలగించాలని నిర్ణయించింది. ఇందుకు 55 ఏళ్లు పైబడిన లేదా 2020 మొదటి త్రైమాసికాని కల్లా 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని అన్ని జోనల్‌ కార్యాలయాలకు సూచించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘ఈనెల 27న రైల్వే శాఖ అన్ని జోనల్‌ కార్యాలయాలకు లేఖ పంపింది. ఉద్యోగుల వివరాలను సమర్పించడానికి ఆఖరు తేదీ ఆగస్టు 9 అని పేర్కొంది’ అని జోనల్‌ కార్యాలయాలు తెలిపాయి.

సరైన పనితీరు కనబరచని లేదా క్రమశిక్షణ పాటించని ఉద్యోగులను ముందస్తు పదవీ విరమణ ద్వారా తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించిందని, ఈ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తోందని వర్గాలు పేర్కొన్నాయి. ముందస్తు పదవీ విరమణ నిబంధనకు సంబంధించి ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 1.19 లక్షల మందికి పైగా గ్రూప్‌–ఏ, గ్రూప్‌–బీ ఉద్యోగుల పనితీరును 2014–19 మధ్య కాలంలో సమీక్షించినట్లు ఇటీవల లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులున్నారని, వారిని 2020 కల్లా 10 లక్షల మందికి తగ్గించడమే మంత్రిత్వ శాఖ ఉద్దేశమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు