చైన్‌ స్నాచింగ్‌పై రైల్వేను నిందించలేం: ఎన్‌సీడీఆర్‌సీ

5 Apr, 2018 13:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రైల్వే రక్షణ చర్యలతోనే దొంగతనాలు ఆగవని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిలీ​ : రైలు కిటికీల గుండా జరిగే చైన్‌ స్నాచింగ్‌ వంటి దొంగతనాలకు  రైల్వే ఎంతమాత్రం బాధ్యత వహించదని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) స్పష్టం చేసింది. ఆ మేరకు రాజస్థాన్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

ట్రెయిన్‌ బయటనుంచి స్నాచింగ్‌..
2012లో రాజస్థాన్‌కు చెందిన నందకిశోర్‌ చెన్నై నుంచి ఢిల్లీకి దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రెయిన్‌ ఆగింది. కిటికీ పక్కన కూర్చున్న నందకిశోర్‌ మెడలోని తులం విలువైన బంగారు గొలుసును ఆగంతకుడు ట్రెయిన్‌ బయటనుంచి తెంచుకుని వెళ్లాడు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేరని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పరిహారం చెల్లింపు..
రైల్వే సంస్థ ప్రయాణికుల రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందునే తాను బంగారు గొలుసు కోల్పోయానని కిశోర్‌ రాజస్థాన్‌లోని వినియోగదారుల ఫోరంలో పిటిషన్‌ వేశాడు. ఇరు వర్గాల వాదనలు విన్న ఫోరం చైన్‌ స్నాచింగ్‌కు రైల్వే సంస్థ బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది.  బాధితునికి 36 వేల రూపాయలు నష్ట పరిహారంగా చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. ఫోరం ఆదేశాల మేరకు రైల్వే సంస్థ కిశోర్‌కు పరిహారం చెల్లించింది. దీనిపై ఎన్‌సీడీఆర్‌సీలో భారతీయ రైల్వే రివ్యూ పిటిషన్‌ వేసింది. 

తీర్పు తిరగబడిందిలా..
జస్టిస్‌ అజిత్‌ భరిహోకే నేతృత్వంలోని బెంచ్‌.. దిగువ ఫోరాలు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి తక్కువ మొత్తమే కదా అని  పరిహారం చెల్లించవద్దని రైల్వే సంస్థను మందలించింది. ‘రైలు లోపల ప్రయాణించే ప్యాసెంజర్‌ రక్షణ బాధ్యతలు చూసుకోవడమే రైల్వే విధి. వారి రక్షణ బాద్యతలు చూసుకోవడంలో రైల్వే విఫలమైందన్న వాదనతో మేము ఏకీభవించం. చైన్‌ స్నాచింగ్‌ జరిగింది కిటికీ గుండా కాబట్టి దానికి రైల్వే బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’ అని బెంచ్‌ అభిప్రాయ పడింది. రైల్వే సర్వీసుల్లో లోపం కారణంగానే బాధితుడు తన గొలుసు కోల్పోయాడనే రాజస్థాన్‌ ఫోరం వాదనను తోసిపుచ్చింది. కేవలం రైల్వే సంస్థ రక్షణ చర్యల ద్వారానే ఇలాంటి దొంగతనాలు ఆగవు అని కమీషన్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు