రెండు రాజధానుల మధ్య...

13 Oct, 2017 18:52 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఒకటి దేశ రాజధాని..మరోటి దేశానికి ఆర్థిక రాజధాని.. ఈ రెండు రాజధానులను కలుపుతూ సోమవారం నుంచి న్యూ స్పెషల్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పరుగులు పెట్టనుంది. ఢిల్లీ, ముంబయిల మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని కల్పించేందుకు ఈ రైలు సర్వీసును ప్రవేశపెడుతున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైలుకు ఫ్లెక్సి ఫేర్‌ వర్తించదని, అయితే ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే సెకండ్‌, థర్డ్‌ ఏసీ చార్జీలు దాదాపు 19 శాతం తక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.

రెండు మెట్రో నగరాలను కలుపుతూ ఇప్పటికే రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, 30 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. న్యూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రాకతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటల వరకూ తగ్గుతుందని అధికారులు చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ మార్గమధ్యంలో కోట, వదోదర, సూరత్‌లలో మాత్రమే ఆగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు