ప్యాసింజర్‌ రైల్లో ప్రైవేటు కూత

2 Jul, 2020 08:48 IST|Sakshi

109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లు 

ప్రైవేటు సంస్థల నుంచి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌’లకు ఆహ్వానం

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికే కార్యక్రమానికి బుధవారం రైల్వే శాఖ లాంఛనంగా శ్రీకారం చుట్టింది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌’లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతాయని ఆశిస్తున్నారు. ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు పెట్టుబడులను ఆమోదించడం ఇదే ప్రథమం.

అయితే, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిర్వహణలో ‘ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)’ భాగస్వామ్యం గత సంవత్సరమే ప్రారంభమైంది. లక్నో – ఢిల్లీ మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ఐఆర్‌సీటీసీకి గత సంవత్సరం అనుమతి లభించింది. దీంతోపాటు ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వారణాసి– ఇండోర్‌ మార్గంలో కాశి మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ను, అహ్మదాబాద్‌– ముంబై మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. ప్రైవేటు పెట్టుబడులతో ఆధునిక సాధన సంపత్తి, ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సమకూరుతాయని రైల్వే శాఖ భావిస్తోంది. ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్న 109 మార్గాలను 12 క్లస్టర్లుగా విభజించారు. ఈ 151 ఆధునిక రైళ్లలో అత్యధికం భారత్‌లోనే రూపొందుతాయి. వీటిలో 16 కోచ్‌లు ఉంటాయి. గంటకు 160 కిమీల గరిష్ట వేగంతో వెళ్లేలా ఈ రైళ్లను డిజైన్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు