రైల్వేల పనితీరు దారుణం

3 Dec, 2019 04:50 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వే శాఖ పనితీరును కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తప్పుబట్టింది. 2017–18 సంవత్సరంలో రైల్వేల నిర్వహణ రేషియో 98.44 శాతం అంతకుముందు పదేళ్ల కంటే అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈమేరకు సోమవారం పార్లమెంట్‌కు ఓ నివేదికను సమర్పించింది. రైల్వే శాఖ ఆదాయ, వ్యయాల రేషియోను బట్టి నిర్వహణలో సమర్థత, ఆర్థిక బాగోగులను అంచనా వేస్తారు. ‘ఎన్టీపీసీ, ఇర్కాన్‌ సంస్థల నుంచి అడ్వాన్సులు అందడంతో 2017–18 సంవత్సరాల కాలంలో రూ.1665.61 కోట్ల మిగులుంది. అదే లేకుంటే రూ.5,676.29 కోట్లు లోటు మిగిలేది. ఆ శాఖ ప్రతి రూ.100 ఆదాయంలో రూ.98.44 ఖర్చు పెట్టింది. ఈ రేషియో గత పదేళ్ల కంటే అధ్వానం. అడ్వాన్సులను మినహాయిస్తే నిర్వహణ రేషియో 102.66కు పెరిగి ఉండేది’అని పేర్కొంది. ‘ప్రయాణికులు, కోచ్‌ సర్వీసుల నిర్వహణ వ్యయాలను కూడా రైల్వేలు నియంత్రించుకోలేదు’అని తెలిపింది.

>
మరిన్ని వార్తలు