ఎలుక తెచ్చిన తంటా

31 Aug, 2018 03:55 IST|Sakshi

రూ. 32 వేలు నష్టపరిహారం చెల్లించాలని రైల్వేశాఖకు ఆదేశం  

సాక్షి ప్రతినిధి, చెన్నై: రైలు బోగీలో ప్రయాణికులే కాదు.. అడపాదడపా ఎలుకలూ ప్రయాణిస్తుంటాయి. అలాంటి ఓ ఎలుక బుద్ధిగా ప్రయాణం చేయకుండా తగుదునమ్మా అంటూ సాటి ప్రయాణికుడిని కరిచింది. బాధితుని ఫిర్యాదుతో రైల్వేశాఖకు రూ.32 వేలు వదిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన వెంకటాచలం 2014 ఆగస్టు 8వ తేదీన ఎక్స్‌ప్రెస్‌ రైల్లో సేలం మీదుగా చెన్నైకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో అతడిని ఎలుక కరవగా తీవ్ర రక్తస్రావమైంది.

వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేసినా ప్రథమచికిత్స అందలేదు. తరువాత వచ్చే స్టేషన్‌లో మాత్రమే చికిత్స చేయగలమని టీటీఈ బదులిచ్చారు. దీంతో చెన్నై చేరుకోగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసుకుని, మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు కలిగిన బాధకు నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరంలో పిటిషన్‌ వేశాడు.

బాధితునికి రూ.25 వేల నష్టపరిహారం, వైద్య ఖర్చులకు రూ.2వేలు, కోర్టు ఖర్చులకు రూ.5వేలు లెక్కన మొత్తం రూ.32 వేలను 9 శాతం వడ్డీ సహా చెల్లించాలని తమిళనాడు వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి ఆర్‌వీ దీనదయాళన్, సభ్యులు రాజ్యలక్ష్మి రైల్వేశాఖను ఆదేశిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఈ సొమ్ము 3 నెలల్లోగా బాధితునికి అందజేయాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు