‘హమ్‌సఫర్‌’ ఫ్లెక్సీ ఫేర్‌ తొలగింపు

14 Sep, 2019 03:41 IST|Sakshi

త్వరలో ఆయా రైళ్లలో స్లీపర్‌ బోగీలు

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త .ప్రీమియం రైళ్లు అయిన హమ్‌సఫర్‌ రైళ్లకు ఫ్లెక్సీ ఫేర్‌ విధానాన్ని తొలగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అంతేగాక వాటిలో స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వేకి చెందిన ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. శుక్రవారం ఆనంద్‌ విహార్‌ నుంచి అలహాబాద్‌ వెళ్లే హమ్‌సఫర్‌ రైల్లో నాలుగు స్లీపర్‌ బోగీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం 35 హమ్‌సఫర్‌ రైళ్లకు వర్తిస్తుందని, ప్రస్తుతం వాటిలో 3–టైర్‌ ఏసీ వరకు మాత్రమే బోగీలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆయా జోన్ల అవసరాలను బట్టి స్లీపర్‌ బోగీలను ప్రవేశపెడుతామని ఆ అధికారి తెలిపారు. వీటితోపాటు హమ్‌సఫర్‌ రైళ్ల తత్కాల్‌ బుకింగ్‌ ధరలను కూడా తగ్గించారు. ఇన్నాళ్లు ఈ రైళ్లలో తత్కాల్‌ బుకింగ్‌లకు సాధారణ టికెట్‌ ధరపై 1.5 శాతం అధికంగా వసూలు చేయగా ఇకపై 1.3 శాతం వసూలు చేస్తారు. దీంతో మిగతా రైళ్లలోని తత్కాల్‌ ధరలతో హమ్‌సఫర్‌ రైళ్ల తత్కాల్‌ ధరలు సమానమవుతాయి. కాగా గత కొన్ని వారాలుగా ఏసీ చైర్‌ కార్, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ సీట్లున్న రైళ్లలో టికెట్‌ ధరలపై రైల్వేశాఖ 25 శాతం తక్కువ ధర వసూలు చేస్తుండటం తెలిసిందే. అంతేగాక సరుకు రవాణా ధరల్లో కూడా డిస్కౌంట్లను ప్రకటించింది.

మరిన్ని వార్తలు