డిమాండ్‌ను బట్టి రైలు చార్జీల మోత

8 Sep, 2016 03:25 IST|Sakshi
డిమాండ్‌ను బట్టి రైలు చార్జీల మోత

శతాబ్ది, రాజధాని, దురంతో టికెట్ల ధరలకు రెక్కలు!

 న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.500 కోట్ల ఆదాయమే లక్ష్యంగా రైల్వే శాఖ రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్ల టికెట్ ధరలను అమాంతం పెంచనుంది. 10 నుంచి 50 శాతం వరకు ధరలు పెరగొచ్చు. ఈ రైళ్లలోని రెండో తరగతి, మూడో తరగతి ఏసీ, చైర్ కార్ కోచ్‌లలో, దురంతో రైళ్లలోని స్లీపర్ క్లాస్‌లలో ఈ కొత్త ధరలను అమలుచేయనున్నారు. దళారులను అడ్డుకునేందుకు ఈ పద్ధతిని సెప్టెంబర్ 9 నుంచి ప్రయోగాత్మకంగా తెస్తున్నామని రైల్వే బోర్డు సభ్యుడు మొహమ్మద్ జంషెడ్ తెలిపారు. 3-4  నెలల తర్వాత ధరలను సమీక్షించనున్నారు. మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను సాధారణ ధరలకు విక్రయిస్తారు.

ఆ తర్వాత ప్రతీ పదిశాతం సీట్ల ధరలను పదిశాతం చొప్పున పెంచుతూ మొత్తం బెర్తుల్లో సగం బెర్తులను ఇలా అధిక ధరలకు విక్రయిస్తారు. దీంతో సెకండ్ ఏసీ, చైర్ కార్ ధరలు 59 శాతం, థర్డ్ ఏసీ ధరలు 40 శాతం పెరిగే వీలుంది. పౌరవిమానయాన రంగంలో అమల్లో ఉన్న వినూత్న ధరల విధానాన్ని ఇలా రైల్వేల్లో అమలుచేయనున్నారు. ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలు, రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్, కేటరింగ్, సర్వీస్ చార్జీల్లో  మార్పు లేదు. 42 రాజధాని, 46 శతాబ్ది, 54 దురంతో రైళ్లలో కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ముంబై రాజధాని రైల్లో థర్డ్ ఏసీ టికెట్ సాధారణ ధర రూ.1628 ఉంటే అది 10శాతం ఎక్కువతో రూ.1791, 50శాతం ఎక్కువతో రూ.2,279కు చేరనుంది.

మరిన్ని వార్తలు