కరువు పీడిత మరాఠ్వాడాలో కురుస్తున్న వానలు

13 Jul, 2013 23:31 IST|Sakshi

పుణే/నాసిక్:
 ఇటీవలి వర్షాలు అటు కరువుపీడిత మరాఠ్వాడా ప్రాంత ప్రజలతోపాటు, ఇటు ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. కరువు నేపథ్యంలో నిన్నామొన్నటిదాకా ప్రభుత్వం భారీసంఖ్యలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన సంగతి విదితమే. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ట్యాంకర్ల సంఖ్యను తగ్గించేందుకు తోడ్పడ్డాయి. దీంతో ప్రభుత్వానికి కూడా కొంతమేర ఆర్ధిక భారం తగ్గింది. మరోవైపు ప్రజలకు నీటి తిప్పలు కొంతమేర తగ్గాయి. దీంతోపాటు రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించుకునేందుకు వీలు కలిగింది. నిన్నామొన్నటిదాకా 2,371 ట్యాంకర్లను నీటి సరఫరా కోసం అధికారులు వినియోగించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,090కి తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యతపై ప్రభుత్వం సంబంధిత అధికారులతో దానిపై అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా తన నీటిసరఫరా ప్రణాళికను మార్చుకుంది. మరాఠ్వాడా పరిధిలోని 1,053 గ్రామాలు, 518 హ్యామ్లెట్లకు ప్రస్తుతం ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరాఠ్వాడా పరిధిలోని జలాశయాల్లో నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో గత ఏడాది నవంబర్ నుంచే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ప్రారంభించింది. ఔరంగాబాద్ జిల్లా వాసుల నీటి అవసరాలను 441 ట్యాంకర్లు తీరుస్తున్నాయి. జలాశయాల్లో నీటిమట్టం ఇంకా పెరగాల్సి ఉందని, అందువల్ల మరికొంతకాలంపాటు ట్యాంకర్ల సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన ఓ నివేదికలో పేర్కొన్నారు. ఎగువప్రాంతంలో నిర్మించిన జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండిపోయేదాకా మరాఠ్వాడా ప్రాంతానికి ట్యాంకర్ల నుంచి విముక్తి లభించదు.
 పెరుగుతున్న నీటిమట్టం
 ఇటీవల కురుస్తున్న వర్షాలతో వివిధ జలాశయాల్లో నీటిమట్టం కొంతమేర పెరిగింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నిన్నామొన్నటిదాకా ఇవన్నీ కళావిహీనమైన సంగతి విదితమే. నాసిక్ జిల్లాలోని గంగాపూర్ డ్యాం సామర్థ్యం 5,630 మిలియన్ క్యూబిక్ అడుగులు (ఎంసీఎఫ్‌టీ) కాగా ప్రస్తుతం అందులో 1,885 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో నీటిమట్టం 580 మిలియన్ క్యూబిక్ అడుగులుగా నమోదైన సంగతి విదితమే. ఇక ఇదే జిల్లాలోని కాశ్యపి జలాశయం నిల్వ సామర్థ్యం 1,852  మిలియన్ క్యూబిక్ అడుగులు కాగా ప్రస్తుతం ఇందులో 148 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో కేవలం ఏడు మిలియన్ క్యూబిక్ అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. గౌతమి గోదావరి నదిలో ప్రస్తుత నీటిమట్టం 1,883 ఎంసీఎఫ్‌టీ కాగా గత ఏడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో కేవలం 236 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర నీరు ఉంది.
 పొంగిపొర్లుతున్న ’పర్లకోటా’
 గడ్చిరోలి, న్యూస్‌లైన్: రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గడ్చిరోలి జిల్లాలోని భామరాఘడ్ తాలూకాలో సుమారు 128 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పర్ల్‌కోటా నది పొంగి పొర్లు తుండటంతో నీళ్లు భామరాగఢ్ తాలూకాలోకి ప్రవేశించాయి. లోతట్టు ప్రాంతాల్లోని అనేక ఇళ్లు నీట మునిగాయి. ఈమేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. భామరాగడ్ తాలూకాలో అత్యధికంగా 252 మిల్లీమీటర్ల వర్షపాతం  నమోదైంది.  శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భామరాగఢ్‌లోని పర్ల్‌కోటా నదిపై ఉన్న వంతెన వరకు నీళ్లు చేరాయి. ఉదయం ఎనిమిది గంటలకు పర్ల్‌కోటా వంతెన మునిగిపోయింది.అనంతరం నీళ్లు గ్రామాలకు చొచ్చుకుపోవడం మొదలైంది. దీంతో తాలూకాలోని పలు దుకాణాలు, ఇళ్లలోకి నీళ్లు చేరాయి. శుక్రవారం సాయంత్రం పర్ల్‌కోటా నది ప్రమాదకర మట్టాన్ని దాటింది. ఏ సమయంలోనైనా ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉందని గ్రామస్తులు రాత్రంతా అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది. తాలూకాలోని జ్యుబ్బీ, హోడరీ, నేరగుండా, కోఠి తదితర మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. నీరు చేరిన ఇళ్లలోని నివాసితులను, వస్తువులను ఇతర సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అదేవిధంగా చామోర్శీ, కుర్ఖేడా, దేశాయిగంజ్, ఆర్మోరీ, గడ్చిరోలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. చామోర్శీ తాలూకాలోని గుండాపల్లిలో చాలా దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. ఆష్టీ-ఘోట్ మార్గంలో సుమారు మూడు ఫీట్ల వరకు నీరు రావడంతో వాహనరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు