రికార్డుస్థాయిలో నమోదైన వర్షపాతం..

10 Sep, 2019 15:23 IST|Sakshi

ముంబై : ముంబై మహానగరంలో రికార్డు వర్షపాతం నమోదైంది. 2010లో పడిన రికార్డు వర్షం తర్వాత ఈ సంవత్సరమే అత్యధికంగా వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ వెలువరించిన నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 3,286.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 2010లో నమోదు అయిన 3327 మిల్లీమీటర్ల వర్షపాతం తర్వాత ఇదే ఎక్కువ. సాధారణంగా నైరుతీ సీజన్‌ జూన్‌తో మొదలై సెప్టెంబరుతో ముగుస్తుంది. ఇంకా సెప్టెంబర్ నెల ముగియడానికి 20 రోజులు మిగిలి ఉండటంతో మరింత వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే 2011లో నమోదైన 3,154 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం అధిగమించిన ఈ సీజన్‌లో మరికొన్ని రోజులు ఉండటంతో 2010లో నమోదైన రికార్డును కూడా చెరిపేయవచ్చు.

నైరుతీ రుతుపవనాలు భారత తీరప్రాంతాన్ని జూన్‌ 10న తాకుతాయని అంచనా వేసినా అవి 15 రోజులు ఆలస్యంగా భారత వాతావరణంలో ప్రవేశించాయి. దీంతో ముంబైలో సాధారణ వర్షపాతం సంవత్సరానికి 2,514 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని అనుకున్నారు. కానీ ఊహించనివిధంగా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒక్క ఆదివారమే రోజంతా కుండపోతగా వర్షం కురవడంతో నగరం జలమయమై పలుచోట్ల ముంపునకు గురయింది. వాతావరణ శాఖ పసుపు రంగు గుర్తు ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
చదవండి : దంచికొడుతున్న వానలు.. ముంబైలో రెడ్‌ అలర్ట్‌

మరిన్ని వార్తలు