ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు

7 Jul, 2013 03:50 IST|Sakshi
ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు

డెహ్రాడూన్: మొన్నటిదాకా వరదలతో అల్లాడిపోయిన ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రుద్రప్రయాగ, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా పడుతున్న వానలతో సహాయ, పునరావాస చర్యలకు విఘాతం ఏర్పడింది. భాగీరథీ నదిలో నీటిమట్టం పెరుగుతుండడంతో ముందుజాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వచ్చే 24 గంటల్లో నైనిటాల్, పిటోరాగఢ్, అల్మోరా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ల ద్వారా రుద్రప్రయాగ జిల్లాలోని కేదార్‌ఘాటీలో బాధితులకు తిండిగింజలు, సహాయ సామగ్రిని అందించలేకపోతున్నామని జిల్లా కలెక్టర్ దిలీప్ జవాల్కర్ శనివారం చెప్పారు. వర్షాల కారణంగా కేదార్‌నాథ్ చుట్టపక్కల ప్రాంతాల్లో సామూహిక అంత్యక్రియల ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదని, ఇప్పటిదాకా 72 మృతదేహాలకు మాత్రమే అంతిమ సంస్కారాలు పూర్తి చేసినట్లు డీజీపీ సత్యవ్రత్ బన్సాల్ తెలిపారు. ఈనెల 15కల్లా తెగినపోయిన రోడ్లన్నింటినీ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుభాష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మరోవైపు రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపడకపోవడంతో బాధితులకు అందివ్వాల్సిన టన్నుల కొద్దీ సహాయ సామగ్రి ప్రభుత్వ గోదాముల్లో మూలుగుతోంది.

కలెక్టర్‌పై వేటు..: సహాయక సామగ్రి పంపిణీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ రాజేష్ కుమార్‌పై వేటు వేసింది. కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. సీఎం విజ య్ బహుగుణ తనయుడు సాకేత్ శుక్రవారం ఉత్తరకాశీలో పర్యటించారు. ఈ సందర్భంగా కుమార్‌పై వరద బాధితుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఆయనపై వేటు వేయడం గమనార్హం. సహాయాన్ని నిరాకరించినందుకు ఆగ్రహించిన బాధితులు ఇటీవల ఓసారి కుమార్‌ను బంధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హరిద్వార్‌లో స్థానిక బీఎస్పీ నాయకుడు రవీంద్ర చౌదరీ కంపెనీకి చెందిన ఓ గోదాం నుంచి శుక్రవారం అధికారులు వెయ్యి క్వింటాళ్ల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు