కేరళలో వరద విలయం

10 Aug, 2019 03:48 IST|Sakshi
శుక్రవారం వరద నీటితో నిండిపోయిన కొచ్చి విమానాశ్రయం రన్‌వేలు

వర్ష బీభత్సానికి 35 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 40 మంది గల్లంతు

కోచి విమానాశ్రయం మూసివేత

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో 47కి చేరిన మృతులు

చెన్నై/తిరువనంతపురం/బెంగళూరు/సాక్షి ముంబై: ఏకధాటిగా కురుస్తున్న వానలతో దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర విలవిల్లాడుతున్నాయి. కేరళలో వరదలతో గత మూడు రోజుల్లో 35 మంది చనిపోగా మలప్పురం, వయనాడ్‌ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన రెండు ఘటనల్లో సుమారు 40 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు 25 వరకు నమోదయ్యాయి. అధికార యంత్రాంగం సుమారు 64 వేల మందిని 738 సహాయక శిబిరాలకు తరలించింది.

వయనాడ్‌ జిల్లా మెప్పడి, మలప్పురం జిల్లా నిలాంబర్‌లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని కేరళ సీఎం విజయన్‌ తెలిపారు. వరద తీవ్రతకు మెప్పడిలోని పుత్తుమల టీ ప్లాంటేషన్‌ నామ రూపాల్లేకుండా పోయిందని, అందులో చిక్కుకున్న 40 మందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్మీ తెలిపింది. ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడగా మరో 9 మందిని రక్షించామని పేర్కొంది. ఈ ప్రాంతంలో సుమారు 70 ఇళ్లు ధ్వంసమయ్యాయని అంచనా. మలప్పురం జిల్లాలోని కొండప్రాంత కవలపర గ్రామంలోని 40 ఇళ్లు కొట్టుకుపోయాయి.

ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అయితే, నష్టం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. పలక్కడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెం.మీ. నుంచి 39 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. పెరియార్‌ నది పొంగుతుండటంతో కొచ్చి విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో కొచ్చి విమానాశ్రయాన్ని శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కొచ్చికి వచ్చే విమానాలను తిరువనంతపురం విమానాశ్రయానికి మళ్లిస్తున్నారు. కొండప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. రైల్వే శాఖ పలు సర్వీసులను రద్దు చేసింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను వయనాడ్, మలప్పురం, కన్నూర్, ఇడుక్కి తదితర 9 కొండ ప్రాంత జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. గత ఏడాది సంభవించిన వరదల్లో కేరళలో 400 మందికిపైగా మరణించడం తెలిసిందే.

కనువిందు చేసే ప్లాంటేషన్‌ కనుమరుగైంది
వయనాడ్‌ జిల్లాలో మెప్పడి సమీపంలోని పుత్తుమల టీ ప్లాంటేషన్‌లకు పెట్టింది పేరు. ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా. గురువారం సాయంత్రం వరకు ఈ ప్రాంతం.. లోయలు..ఎత్తైన కొండలు, చెట్లు.. కనువిందు చేసే పచ్చదనంతో కళకళలాడింది. అయితే, ఎడతెగని వర్షాలు, భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా పచ్చదనం బదులు ఇప్పుడు మట్టి, బురదతో నిండిపోయింది. కొండ శిఖరాలు సైతం చదునుగా మారాయి. చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. ఇళ్లు, భవనాలు, గుడి, మసీదు తుడిచిపెట్టుకుపోయాయి. అక్కడ అసలు జనం ఉన్న ఆనవాళ్లే కనిపించకుండాపోయాయి. రెండు కొండల మధ్య నున్న సుమారు 100 ఎకరాల భూమి, ప్లాంటేషన్లు, భవనాలు, జనంతో కళకళలాడిన ఆ లోయ బురదతో నిండిపోయింది.

4 రాష్ట్రాల్లో 83 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు
మహారాష్ట, కర్ణాటక, కేరళ, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో 83 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు హోం శాఖ తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 173 బృందాలకు వీరు అదనమని తెలిపింది.

వరదలో చిక్కుకున్న హిమాచల్‌ సీఎం కుమార్తె
హిమాచల్‌ సీఎం ఠాకూర్‌ కుమార్తె అవంతిక వరదల్లో చిక్కుకున్నారు. ఉడిపి జిల్లా మణిపాల్‌ వర్సిటీలో ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న అవంతిక స్నేహితులతో కలిసి బాదామికి బయలుదేరారు. వీరి బస్సు మలప్రభ నది వరదలో చిక్కుకుంది. దీంతో అవంతిక, ఆమె స్నేహితులు బస్సు దిగి వరద నీటిలోనే ముందుకు వెళ్లారు. హొసూరులో గ్రామస్తులు వారికి ఆశ్రయం కల్పించారు.

కేరళను ఆదుకోండి: రాహుల్‌
వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు,  వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, ప్రధానిని కోరారు. వర్షాలకు కేరళలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్న విషయాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.  కావలసిన సహాయాన్ని అందిస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు వయనాడ్‌ ఎంపీ ఆఫీస్‌ ట్విటర్‌ ఖాతాలో రాహుల్‌ పోస్ట్‌ చేశారు.

కర్ణాటకలో 12 మంది మృతి
కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 12 మంది మృతి చెందారని సీఎం యడియూరప్ప తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని 1.24 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. శుక్రవారం కొడగు జిల్లా కొరంగాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, నేవీ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.

తమిళనాడులో ఐదుగురు మృతి
తమిళనాడులో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో వానల ఉధృతి కొనసాగుతోంది. నీలగిరి జిల్లాలో ధారాపాతంగా కురిసిన వర్షాలకు ఐదుగురు చనిపోయారు. లోతట్టు ప్రాంతాల్లోని 1,704 మందిని 28 సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు తెలిపారు. దక్షిణ భారతంలోనే మునుపెన్నడూ లేనంతగా వర్షపాతం ఇక్కడ నమోదయింది. పర్యాటక ప్రాంతం అవలాంచిలో గత 72 గంటల్లో 2,136 మి.మీ. వర్షం కురిసింది.

వయనాడ్‌లో ఉధృతంగా  ప్రవహిస్తున్న వరద నీరు

మహారాష్ట్రలో మొత్తం 30 మంది మృతి
మహారాష్ట్రలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 30 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. సాంగ్లి జిల్లాలో పడవ బోల్తా ప్రమాదంలో గల్లంతైన ఐదుగురి జాడ తెలియలేదని పేర్కొన్నారు. కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాల్లో ముంపుప్రాంతాల నుంచి 2.52 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కొల్హాపూర్‌లో వరద పరిస్థితి మెరుగయింది.

మరిన్ని వార్తలు