రాజకీయాల్లోకి నటుడి కుమార్తె!

9 Sep, 2016 11:52 IST|Sakshi
రాజకీయాల్లోకి నటుడి కుమార్తె!

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నటుడు రాజ్ బబ్బర్ కుమార్తె జుహీ బబ్బర్ తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆగ్రా సౌత్ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెలలో వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

జిల్లాలో ఆగ్రా సౌత్ నియోజకవర్గంకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక్కడ నుంచి జుహీని పోటీకి నిలబెడితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం.‘ఆగ్రా నుంచి జుహీ బబ్బర్ రాజకీయాల్లోకి అడుగుపెడతారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తితో ఎదురు చూస్తున్నార’ని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

రాజకీయాల పట్ల జుహీకి అవగాహన ఉందని, తన తండ్రి రాజ్ బబ్బర్ తరపున ఆమె ఎన్నికల ప్రచారం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. 2009లో ఫిరోజబాద్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా తన తండ్రి తరపున ప్రచారం చేసేందుకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను జుహీ ఒ‍ప్పించారని గుర్తు చేశారు. ఆగ్రా సౌత్ నుంచి పోటీ చేస్తే ఆమె తప్పకుండా గెలుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు