రేపిస్టుల కాళ్లు, చేతులు నరికేయండి: ఠాక్రే

25 Jul, 2016 15:39 IST|Sakshi
రేపిస్టుల కాళ్లు, చేతులు నరికేయండి: ఠాక్రే

అహ్మద్ నగర్: మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై 'షరియా' (ఇస్లామిక్) వంటి  కఠినచట్టాలను అమలు చేయాలని ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్, హత్య జరగడం నిజంగా ఆందోళనకరమన్నారు. మైనర్లు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కాళ్లు, చేతులు నరికేయడమే సరైన పద్ధతంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జూలై 13న జరిగిన దారుణ ఘటనపై ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాఛారం చేసి, ఆపై హత్యచేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయనడానికి నిదర్శనమన్నారు. అందుకే ఇటువంటి తీవ్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఘటనతో గత కాంగ్రెస్ ప్రభుత్వంకంటే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధ్వాన్న స్థితికి చేరినట్లు నిరూపించుకుందన్నారు.

జిల్లా కేంద్రానికి సుమారు 76 కిలోమీటర్ల దూరంలోని కంర్ణత్ తాలూకా కోపర్ది గ్రామం సందర్శించిన రాజ్ ఠాక్రే.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను అత్యవసరంగా మార్చాలని, తీవ్ర నేరాలకు పాల్పడేవారిని, సంఘవ్యతిరేక శక్తులను సమూలంగా నిర్మూలించేందుకు  'షరియా' వంటి కఠిన చట్టాలను అమల్లోకి తేవాలని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా అహ్మద్ నగర్ గార్డియన్ మినిస్టర్ రామ్ షిండే సైతం ఆదివారం కోపర్దిలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. నేరస్థులను ఎట్టిపరిస్థితిలో వదిలి పెట్టేది లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరస్థులకు కఠినంగా శిక్షపడేట్లు చూస్తామని బాధితకుటుంబానికి భరోసా ఇచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా