సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు?

10 Feb, 2020 04:25 IST|Sakshi

మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే

ముంబై: అక్రమంగా భారత్‌లో నివాసముంటున్న పాకిస్తానీయులు, బంగ్లాదేశీలను తిప్పి పంపాల్సిందేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లకు మద్దతుగా ఆదివారం ముంబైలో గిర్గావ్‌ చౌపట్టి నుంచి ఆజాద్‌ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఆజాద్‌ మైదానంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు ఎందుకు చేస్తున్నారంటూ సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ప్రశ్నించారు.

నిరసనలు ఇలాగే కొనసాగితే.. నిరసనలకు నిరసనలతో, రాళ్లకు రాళ్లతో, ఖడ్గాలకు ఖడ్గాలతోనే జవాబిస్తామని హెచ్చరించారు. పుట్టినప్పటి నుంచి భారత్‌లోనే ఉన్న ముస్లింలను ఎవరూ వెలివేయబోవడంలేదని, వారెందుకు నిరసనలు చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారులు తమ బలాన్ని ఎవరికి, ఎందుకు చూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సీఏఏను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే నిరసనలు జరుగుతున్నాయన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్‌ ఏమైనా ధర్మసత్రమా అని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు