రాజా మాన్‌సింగ్‌ హత్య కేసు.. రేపు శిక్ష ఖరారు

21 Jul, 2020 20:27 IST|Sakshi

లక్నో: ముప్పై అయిదేళ్ళ క్రితం జరిగిన రాజా మాన్‌సింగ్ హత్య కేసులో మంగళవారం 11 మంది పోలీసులను మధుర కోర్టు దోషులుగా తేల్చింది. గత రెండు దశాబ్దాలుగా విచారిస్తున్న ఈ కేసుకు ముగింపు పలికింది. రేపు కోర్టు దోషులకు శిక్షను ఖరారు చేయనుంది. 1985 నాటి ఈ కేసు వివరాలు.. రాజస్తాన్‌, భరత్‌పూర్ రాజవంశీకుడు రాజా మాన్‌సింగ్ 1985 ఫిబ్రవరి 21న హత్యకు గురయ్యారు. ఈ హత్య అప్పట్లో రాజకీయంగా కలకలం రేపింది. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత అప్పటి రాజస్తాన్ ముఖ్యమంత్రి శివ్‌చరణ్ మాథూర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీని గురించి రాజా మాన్ సింగ్ మనవడు దుష్యంత్ సింగ్ మాట్లాడుతూ..  '1985 అసెంబ్లీ ఎన్నికల్లో డీగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజా మాన్ సింగ్‌పై కాంగ్రెస్‌ పార్టీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బ్రిజేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు భరత్‌పూర్ సంస్థానం జెండాను అవమానపరిచారు. ఈ ఘటన పట్ల మాన్‌సింగ్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు’ అన్నారు. (పైలట్‌పై గహ్లోత్‌ సంచలన వ్యాఖ్యలు)

ఆయన మాట్లాడుతూ.. ‘దాంతో రాజా మాన్‌ సింగ్‌ వెంటనే ముఖ్యమంత్రి ర్యాలీ జరుగనున్న ప్రాంతానికి జీపులో వెళ్లి సీఎం కోసం ఏర్పాటు చేసిన వేదికతో పాటు చాపర్‌ను కూడా ధ్వంసం చేశారు. ఫిబ్రవరి 20న ఈ ఘటన జరిగింది. ఆ మరుసటి రోజు తన ఇద్దరు అనుచరులతో కలిసి సరెండర్ కావడానికి రాజా మాన్‌సింగ్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో డీఎస్పీ కన్ సింగ్ భాటి నేతృత్వంలోని పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. రాజా మాన్‌సింగ్‌తో పాటు మిగిలిన ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు' అని తెలిపారు దుష్యంత్. మాన్‌సింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత సీఎం రాజీనామా చేశారు. (‘ఆరు నెలల్లో మీరు‌ సాధించినవి ఇవే’)

                                         (రాజా మాన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు)

ఈ క్రమంలో నాటి ఘటనలో పాల్గొన్న 11 మంది పోలీసులను​ కోర్టు ఈరోజు దోషులుగా ప్రకటించింది. వారిలో అప్పటి డీఎస్పీ కన్ సింగ్ భాటి కూడా ఉన్నారు. తొలుత ఈ కేసును రాజస్తాన్ కోర్టు విచారించింది. అయితే అక్కడ కేసును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని భావించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత కేసును ఉత్తరప్రదేశ్ లోని మధుర కోర్టుకు అప్పగించింది. ఈ కేసు కోసం మధుర కోర్టు 1,700 వాయిదాలను(హియరింగ్స్) వినడం గమనార్హం. హత్య జరిగిన 35 ఏళ్లకు కోర్టు జడ్జిమెంట్‌ను ఇచ్చింది. రేపు(బుధవారం) దోషులకు శిక్ష ఖరారు చేయనుంది.

మరిన్ని వార్తలు