పోలీసులుకే ఆశ్చర్యం..10కిమీ..33 నిమిషాలు

31 Mar, 2015 09:44 IST|Sakshi

జైపూర్ :  అతడి పరుగు వేగాన్ని చూసి పోలీసు అధికారులే అవాక్కయ్యారు. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సిన నిర్దేశాన్ని అతడు ఇంకా  సగం సమయం మిగిలి ఉండగానే పూర్తి చేసి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. వివరాల్లోకి వెళితే పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి నిర్వహించిన పరుగు పందెంలో సందీప్ ఆచార్య అనే యువకుడు కేవలం 33 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాడు.  

రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో మార్చి 26న  కానిస్టేబుల్ నియామకాలు పరుగు పందెం నిర్వహించారు. పోలీస్ రిక్రూట్మెంట్కు హాజరు అయిన సందీప్ ఆచార్య దేహ దారుఢ్య పరీక్షలో భాగంగా  తక్కువ వ్యవధిలో పరుగును పూర్తి చేశాడు. దాంతో ఆశ్చర్యపోయిన అధికారులు అతడికి అదనంగా 1.5 కిలోమీటర్ల పరుగు పందెన్ని నిర్వహించారు. ఆ పరుగును అతడు నాలుగే నిమిషాల్లో ముగించేశాడు. దాంతో రిక్రూట్మెంట్ కమిటీలోని ఓ పోలీస్ అధికారి  మాట్లాడుతూ 'సందీప్ పరుగు గాలిని మించినట్లుగా ఉంది. ఫారెస్ట్ గంప్ నా ఫేవరెట్ సినిమా..ఆ సినిమాలో క్యారెక్టర్ నా కళ్ల ముందు నిలిచినట్లు ఉంది'అని వ్యాఖ్యానించటం విశేషం.

హనుమాన్ గఢ్ జిల్లా కిహత్ పురా ఉత్తరాడకు చెందిన సందీప్ తన తండ్రితో పాటు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. చదువుకునే స్థోమత లేక పాఠశాల విద్యతోనే పుల్స్టాప్ పెట్టిన అతడు... అనంతరం దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు. అయితే పరుగు పందెంలో పాల్గొనేందుకు సందీప్ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. అయినా సునాయాసంగా లక్ష్యాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయటం విశేషం.

మరిన్ని వార్తలు