బలపరీక్షకు బీజేపీ పట్టు

14 Jul, 2020 14:47 IST|Sakshi

పైలట్‌పై వేటుతో ఉత్కంఠ

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిశారు. అసెంబ్లీలో తనకు పూర్తి మెజారిటీ ఉందని గవర్నర్‌కు వివరించారు. గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ సీఎల్పీ సమావేశానికి మరోసారి గైర్హాజరు కావడంతో ఆయనను పార్టీ చీఫ్‌ సహా ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తప్పించింది. పైలట్‌ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులపైనా వేటు వేసింది. మరోవైపు సచిన్‌ పైలట్‌ వర్గం తమకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెపుతుండగా, గహ్లోత్‌ శిబిరం తమకు 106 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని వెల్లడించింది. గహ్లోత్‌ సర్కార్‌ మైనారిటీలో పడినందున సభలో గహ్లోత్‌ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలని బీజేపీ పట్టుబట్టింది.

తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పైలట్‌ను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. ప్రలోభాలతో ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు కాషాయ దళం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పార్టీ మారితే రూ 15 కోట్లు ఇచ్చేందుకు తమ ఎమ్మెల్యేలకు బీజేపీ ఆఫర్‌ చేసిందని రాజస్ధాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఆరోపించారు. కాగా రాజస్ధాన్‌ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై సచిన్‌ పైలట్‌ స్పందించారు. సత్యం ఎన్నడూ ఓటమి చెందదని పైలట్‌ ట్వీట్‌ చేశారు. తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలను పైలట్‌ తోసిపుచ్చారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఫిరాయింపుల ద్వారా అధికార పగ్గాలను చేపట్టిన బీజేపీ రాజస్ధాన్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పైలట్‌తో ఎలాంటి చర్చలూ జరపలేదని పేర్కొనడం గమనార్హం. చదవండి: సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ వేటు

మరిన్ని వార్తలు