రెడ్‌జోన్లలో ఆటోలు, టాక్సీలు నడపవచ్చు!

26 May, 2020 19:00 IST|Sakshi

రాజస్థాన్‌ కీలక నిర్ణయం

జైపూర్‌: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్‌ జోన్లు మినహా రెడ్‌జోన్లలో టాక్సీలు, ఆటో రిక్షాలు నడుపుకొనేందుకు అనుమతినిచ్చింది. రెడ్‌జోన్లలోని రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రుల వద్ద వేచి ఉండే ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో టాక్సీ, ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ... తమ కష్టాలు తీరతాయంటూ హర్షం వ్యక్తం చేశారు. (మహారాష్ట్ర పరిస్థితికి ఆయనే కారణం: కాంగ్రెస్‌ నేత)

ఇక ఈ విషయం గురించి ఆటో యూనియన్‌ అధ్యక్షుడు కుల్దీప్‌ సింగ్ మాట్లాడుతూ‌.. ‘‘జైపూర్‌లోని 40 వేల ఆటోరిక్షాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల రవాణా నిలిచిపోయింది. అయితే ప్రస్తుత నిర్ణయంతో రెండు నెలల తర్వాత మాకు మళ్లీ ఉపాధి దొరకనుంది’’అని ఆనందం వ్యక్తం చేశాడు. టాక్సీలు, ఆటోలు నడిపేందుకు అనుమితినిచ్చిందుకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా కుల్దీప్‌ సింగ్‌ ధన్యవాదాలు తెలిపాడు. ప్రభుత్వ నిర్ణయం తమకు మేలు చేసేదిగా ఉందని.. తమ కష్టాలు కొంతమేర తీరతాయని పేర్కొన్నాడు. అయితే నిబంధనలను అనుసరించే వాహనాలు నడపాలని తమకు ఆదేశాలు ఉన్నాయన్నాడు. కాగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు ఏడు వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. దాదాపు 163 మంది మృత్యువాత పడినట్లు సమాచారం.(లాక్‌డౌన్‌ విఫలం: ప్లాన్‌ బి ఏంటి..!)

>
మరిన్ని వార్తలు