గోసంరక్షణ నిధుల కోసం.. లిక్కర్‌పై భారం

25 Jun, 2018 17:06 IST|Sakshi
వసుందర రాజే ( ఫైల్‌ ఫోటో)

గోసంరక్షణ కోసం మద్యంపై 20శాతం పన్ను  విధించిన రాజస్తాన్‌

జైపూర్‌: గోసంరక్షణ కొరకు రాజస్తాన్‌లోని వసుంధర రాజే (బీజేపీ) ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గోవుల రక్షణ కోసం నిధుల సమీకరణకు మద్యంపై 20 శాతం పన్ను విధించింది. ఈ మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ శర్మ ప్రకటన జారీ చేశారు. విదేశీ, స్వదేశీ, బీర్‌ లాంటి తేడాలు లేకుండా వాల్యు యాడెడ్‌ ట్యాక్స్‌ చట్టం 2003 ప్రకారం అన్నింటిపై ఇరవైశాతం పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

గత ఏడాది స్టాంప్‌డ్యూటీపై పదిశాతం పన్ను పెంచడంతో ఏడాదికి రూ.895 కోట్లు ఖజానాకు చేరిందని, ఈ మొత్తం కూడా గోరక్షణ కోసం ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. గోరక్షణ కోసం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.132 కోట్లు, 2017-18లో రూ.123 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 8.58 లక్షల గోవులు ఉన్నాయని వాటి కోసం 2562 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు