చావు కూడు పెట్టలేదని దారుణంగా...

29 Jun, 2018 13:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బర్మార్‌ (రాజస్తాన్‌): అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ మూఢనమ్మకాలు, వింత ఆచారాలతో కుటుంబాల్ని వెలివేసే సంస్కృతి నేటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వింత ఆచారం కారణంగా రాజస్తాన్‌లోని బర్మార్‌ అనే గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు... బర్మార్‌ జిల్లాలోని చోటాన్‌ అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మూడేళ్ల క్రితం మరణించాడు. అయితే ఆ గ్రామ ఆచారం ప్రకారం.. ఆర్ధిక పరిస్థితితో నిమిత్తం లేకుండా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తమను పరామర్శించిన వారికి కచ్చితంగా విందు ఏర్పాటు చేయాలి. దీనిని ‘మృత్యుభోజ్’‌ (పెద్దకర్మ వంటిది) అంటారు. కానీ మరణించిన వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు విందు ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు ఆ కుటుంబాన్ని నానా రకాలుగా వేధించడం మొదలుపెట్టారు.

పెళ్లి చేసుకోవద్దంటూ హెచ్చరికలు..
బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ... మృత్యుభోజ్‌ ఏర్పాటు చేయని కారణంగా తమకు ఉన్న కొద్దిపాటి భూమిని పంచాయతీ పెద్దలు లాక్కున్నారని ఆరోపించాడు. తమను ఇంటి నుంచి వెళ్లగొట్టి.. ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా వేధిస్తున్నట్లు తెలిపాడు. ఊళ్లో జరిగే వేడుకలకు తమను ఆహ్వానించకుండా అవమానానికి గురిచేస్తున్నారన్నాడు. చిన్న పిల్లల్ని బడిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు. తమ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారని... వారిని ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పంచాయతీ పెద్దలు 21 గ్రామాలకు చెందిన యువకులను హెచ్చరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు.

మూడేళ్లుగా ఈ అన్యాయాలను సహిస్తున్నామని.. ఓపిక నశించడంతో బకాసర్‌ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 11న ఫిర్యాదు చేశామని తెలిపాడు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బర్మార్‌ ఎస్పీ గంగదీప్‌ సింగ్లా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు