ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

17 Jul, 2019 16:26 IST|Sakshi

‘ అయ్యయ్యో! ఎవరైనా హెరాయిన్‌ పోగొట్టుకున్నారా? మరేం పర్లేదు. మా దగ్గరే భద్రంగా ఉంది! అది మీకు కావాలంటే మమ్మల్ని ఆశ్రయించవచ్చు! లేనిపక్షంలో ఇంకెప్పటికీ అది మీకు దొరకదు. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాం. మా దగ్గరికి వస్తే ఫుడ్డు, అకామిడేషన్‌ అన్నీ ఉచితం! త్వరపడండి’ అంటూ రాజస్తాన్‌ పోలీసులు చేసిన ఫన్నీ ట్వీట్‌ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. రాజస్తాన్‌లోని ఓ గోడౌన్‌లో భారీగా హెరాయిన్‌ ఉందన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే వీరి రాకను గమనించిన స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోగా.. పోలీసులు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సంచుల్లో నింపి ఉన్న హెరాయిన్‌ ఫొటోలను షేర్‌ చేసిన పోలీసులు పై విధంగా ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో.. ‘మీరు అసోం పోలీసులను కాపీ కొట్టారు సార్‌’ అంటూ కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తుండగా.. మరికొందరేమో.. ‘దొంగలను పట్టుకోకుండా ఏంటిది. మీరు ముంబై పోలీసులను మించిపోయారుగా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా గతంలో అసోం పోలీసులు కూడా ఈ తరహాలోనే స్మగ్లర్లను ఉద్దేశించి.. ‘ఎవరిదైనా భారీ మొత్తంలో (590 కేజీల) గంజాయి పోయిందా? అయితే బాధపడకండి.. అది గత రాత్రి ట్రక్కుతో సహా మాకే దొరికింది. మీదైతే మాత్రం ధుబ్రి పోలీసులకు టచ్‌లో ఉండండి. వారు పక్కా మీకు సహాయం చేస్తారు.’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు