8 Mar, 2018 15:34 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న సుమన్‌ శర్మ

జైపూర్‌ : బీజేపీ నేత, రాజస్థాన్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సుమన్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మగవాళ్ల వేషాధారణ మారాలంటూ ఉపన్యాసం ఇచ్చిన ఆమె.. ఈ క్రమంలో చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కుంటున్నారు. 

‘ప్రస్తుతం ట్రెండ్‌ పేరుతో మగవాళ్ల వేషధారణ మొత్తం మారిపోయింది. లో వెస్ట్‌ జీన్లు వేసుకునే మగాళ్లకి వాళ్ల బట్టలే వాళ్ల కంట్రోల్‌లో ఉండవు. అలాంటోళ్లు వాళ్ల ఇళ్లలోని మహిళలను ఎలా రక్షించుకుంటారు?. ఆడాళ్లు ఒకప్పుడు విశాలమైన ఛాతీ.. దాని నిండా జట్టు ఉన్న మగాళ్లను కావాలని కలలు కనేవాళ్లు. కానీ, ఇప్పుడు అలాంటోళ్లు కనిపించట్లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఆడాళ్లలా చెవి పోగులు ధరిస్తున్న పురుషులు.. మరి జీరో ఫిగర్‌ ఎందుకు మెయింటెన్‌ చెయ్యరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ‘మగాళ్లు మగాళ్లలా బతకండి. నేనేం వారిని విమర్శించటం లేదు. కానీ, ఈ పద్ధతుల్లో మార్పు రావాల్సి ఉందని మాత్రమే చెబుతున్నా’ అని ఆమె తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్‌ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే ఈ విమర్శలపై పలువురు మండిపడుతున్నారు. తమ వస్త్ర ధారణ ఎలా ఉంటే మీకేం బాధంటూ యువత ఆమెను సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారు. వీరికి పలువురు యువతులు కూడా మద్ధతు నిలుస్తుండటం ఇక్కడ విశేషం. ప్రస్తుతం దీనిపై రాజస్థాన్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.

మరిన్ని వార్తలు