ఆ పెద్ద మనుషులు ఇప్పుడేమంటారు: జైట్లీ

6 Aug, 2017 17:16 IST|Sakshi
ఆ పెద్ద మనుషులు ఇప్పుడేమంటారు: జైట్లీ

తిరువనంతపురం : కేరళలో రోజురోజుకు హింస పెరిగిపోతోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యకర్తల దాడిలో చనిపోయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఎన్డీఏ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో తమకు వచ్చిన అవార్డులను తిరిగిచ్చిన పెద్ద మనుషులు ఇప్పుడు సీపీఎం పాలనలోని కేరళ పరిస్థితులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదని హితవు పలికారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. ఆరెస్సెస్ కార్యకర్త రాజేష్ ను గత శుక్రవారం సీపీఎం కార్యకర్తలే దారుణంగా కొట్టి హత్య చేశారని జైట్లీ ఆరోపించారు. రాజేష్ శరీరంపై గాయాలు చూసినట్లయితే ఉగ్రవాదులు కూడా అంతలా చిత్రహింసలు చేయరనిపించినట్లు చెప్పారు. పోలీసులు ఇప్పటికైనా తమ పాత్రను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్డీఏ, బీజేపీ పాలిత రాష్ట్రం కానందునే కొందరు పెద్ద మనుషులు వాపసు ఇవ్వడం లాంటివి చేయడం లేదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు సీపీఎం నేతలు అరుణ్ జైట్లీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు దురదృష్టకరమన్న సీపీఎం నేతలు.. ఇక్కడ చనిపోయిన మా కార్యకర్తలను కేంద్ర మంత్రి జైట్లీ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు