ట్రెండింగ్‌లో రజనీ అభిమానుల వెబ్‌సైట్‌ 

20 Apr, 2019 09:32 IST|Sakshi

తమిళసినిమా: రజనీకాంత్‌ ఏ విషయంలోనైనా ప్రత్యేకమే. ఈ విషయం తన అభిమానుల ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది. విషయం ఏమిటంటే రజనీకాంత్‌ నటుడుగా సూపర్‌స్టార్‌గా గత నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఇప్పుడు సౌత్‌ ఇండియన్‌గా సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నారు. అలాంటి నటుడిని ఆయన అభిమానులు సుమారు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన అప్పటి నుంచి ఇదిగో, అదిగో అంటూ నాన్చుతూ వస్తున్నారేగానీ, రాజకీయాల్లోకి రావడం లేదు. దీంతో ఆయన అభిమానులు చాలా అసంతృప్తికి గురయ్యారు. అలాంటి సమయంలో గత ఏడాది రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నా, ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. దదాన్ని పూర్తి చేస్తాను. ఎంజీఆర్‌ పాలనను తీసుకొస్తాను అంటూ ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతే ఆయన అభిమానుల్లో ఆనందానికి అదుల్లేకుండా పోయాయి. రజనీ కూడా తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. జిల్లాల వారీగా సంఘ నిర్వాహకులను నియమించారు. దీంతో రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం తథ్యం అని ఆయన అభిమానులు సంబరపడ్డారు. రెట్టించిన ఉత్సాహంతో రజనీ ప్రజా సంఘం తరఫున సేవలకు ఉపక్రమించారు. పార్టీని ప్రారంభించి పార్లమెంట్‌ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారని అందరూ భావించారు. అయితే వారు ఊహించినట్లు జరగలేదు. రజనీకాంత్‌  2021లో శాసన సభ ఎన్నికల్లో చూసుకుందాం అని ప్రకటించి ఆయన కొత్త చిత్రాల్లో బిజీ అయిపోయారు. ఇది ఆయన అభిమానులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు ఇష్టమైన వారికి ఓటు వేశారు.

కమల్‌కు ఓట్లు
రజనీకాంత్‌ కంటే వెనుక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన సహనటుడు కమలహాసన్‌ వెనువెంటనే పార్టీని ప్రారంభించడం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిపోయింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కమలహాసన్, మరో నట, దర్శకుడు, నామ్‌ తమిళర్‌ పార్టీ అధ్యక్షుడు సీమాన్‌లు అధిక ఓట్లను పొందగలిగారని, ఎక్కువ స్థానాలను దక్కించుకోబోతున్నారని సర్వేలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుండటంతో రజనీకాంత్‌ అభిమానుల కంటికి కునుకు పట్టనీయడం లేదు.

హెస్టేక్‌ వెబ్‌సైట్‌
దీంతో రజనీకాంత్‌ అభిమానులు తదుపరి ఓటు రజనీకే అంటూ హెస్టేక్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అది ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతోంది. గురువారం రాత్రి వరకూ ఈ హెస్టేక్‌ వెబ్‌సైట్‌ ఇండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అందులో ఈ సారి ఓటు వేశాం. తదుపరి ఓటు కచ్చితంగా రజనీకాంత్‌కే అంటూ ఆయన అభిమానులు ఆ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌ అనూహ్యంగా ఇండియా స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం వారిని ఆనందంలో ముంచెత్తింది.  
 

మరిన్ని వార్తలు