అక్కడి నుంచే రజనీ పోటీ? 

27 Feb, 2020 07:24 IST|Sakshi

పెరంబూరు : హీరో రజనీకాంత్‌ రానున్న శాసనసభ ఎన్నికల్లో  హెప్పన హెళ్లి నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీతో అవసరం అయితే పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. మరో పక్క బీజేపీకి మద్దతుదారుడిగా ముద్ర వేసుకుంటున్నారు. ఆ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రతి అంశానికి సపోర్టు చేస్తున్నారు. కాగా తమిళనాడులో మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికల నగారా మోగనుంది.

అయితే ఇప్పటి వరకూ రజనీ పార్టీ సంగతే పట్టించుకోలేదు. అయితే సూపర్‌స్టార్‌ సోదరుడు సత్యనారాయణన్‌ మాత్రం రజనీకాంత్‌ రాజకీయ పార్టీని స్థాపించడం ఖాయమని, ఈ ఏడాదిలోనే జరుగుతుందని ఘంటా పదంగా చెబుతున్నారు. బుధవారం కూడా ఆయన రజనీకాంత్‌ రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించారు. ఈయన  బుధవారం కృష్టగిరి సమీపంలోని పర్చూర్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం గురించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉండగా ఢిల్లీలో  ఘర్షణలకు పాల్పడటం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలోనే చక్కదిద్దుతారని అన్నారు.

రజనీ రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయమని, ఈ ఏడాది పార్టీ ప్రకటిస్తారని చెప్పారు. ఏ పార్టీతో పొత్తు అన్నది ఆయనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కాగా ఆయన రానున్న శాసనసభ ఎన్నికల్లో హెప్పనహెళ్లి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందని, అయితే ఆ విషయం గురించి రజనీనే నిర్ణయం తీసుకుంటారని సత్యనారాయణన్‌ చెప్పారు. కాగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై రజనీకాంత్‌ స్పందించారు. బుధవారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఇంటలిజెన్స్‌ అధికారుల వైఫల్యమే ఈ అల్లర్లకు కారణమని పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు