తమిళ రాజకీయాల్లో కొత్త శకం

11 Aug, 2017 00:52 IST|Sakshi
తమిళ రాజకీయాల్లో కొత్త శకం

ద్రవిడానికి వచ్చిన ముప్పేమీ లేదు
► డీఎంకే వేదికపై కమల్‌ హాసన్‌ వ్యాఖ్య
► కార్యక్రమానికి హాజరైన రజినీకాంత్‌


సాక్షి, చెన్నై: తమిళనాడులో ఓవైపు అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం గ్రూపులు విలీనం దిశగా అడుగులేస్తుంటే..మరోవైపు సినీస్టార్లు కమల్‌ హాసన్, రజినీకాంత్‌లు డీఎంకే పార్టీ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని తమిళ రాజకీయాలను మరింత వేడెక్కించారు.

అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరో పణలతో ప్రకంపనలు సృష్టించిన కమల్‌ హాసన్‌ డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో కలసి వేదిక పంచుకున్నారు. అటు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కూడా కార్యక్రమానికి హాజరై వేదికపై కాకుండా సభలో ముందువరుసలో కూర్చొన్నారు. వీరిద్దరు రాజకీయ ప్రవేశం చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

1983లోనే కరుణానిధి పిలిచారు: కమల్‌
డీఎంకే అధికార పత్రిక మురసోలి ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చెన్నైలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎంకే పార్టీ నేతలతోపాటుగా పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఇందులో రజినీ, కమల్‌లతో పాటుగా ఐసీసీ మాజీ చీఫ్, ఇండియా సిమెంట్స్‌ చైర్మన్‌ ఎన్‌.శ్రీనివాసన్, కోలీవుడ్‌ నటులు ప్రభుతోపాటు పలువురు హాజరయ్యారు. కమల్‌ మాట్లాడుతూ.. ‘మురసోలి కార్యక్రమానికి వస్తున్నానని తెలిసి.. నా రాజకీయ ప్రవేశాన్ని ఈ వేదిక ద్వారా ప్రకటిస్తానా? అని చాలామంది ట్విటర్‌లో ప్రశ్నించారు.

1983లో కరుణానిధి నాకు టెలిగ్రాం పంపి పార్టీలో ఎందుకు చేరకూడదని అడిగారు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం లేక ఇంతకాలం మౌనంగానే ఉన్నాను. ఇప్పటికీ దీనికి సమాధానం చెప్పలేకపోతున్నాను. కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం నడుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. విభిన్న భావాలు, అభిప్రాయాలు ఉన్న పత్రికలకు చెందిన ప్రతినిధులే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నప్పుడు, ఓ పత్రికను ప్రారంభించి మధ్యలోనే తాళం వేసుకున్న తాను ఎందుకు హాజరు కాకూడదన్న భావంతోనే కార్యక్రమానికి వచ్చినట్లు కమల్‌ వెల్లడించారు.

ద్రవిడ శకం ఇక ముగిసిందని కొందరు తెగ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ జాతీయగీతంలో ‘ద్రావిడ’ పదం ఉన్నంత కాలం ద్రవిడానికి అంతం లేదని తేల్చిచెప్పారు. రజినీకాంత్‌ మాత్రం వేదికపై మాట్లాడలేదు. అయితే, ఇటీవల కమల్‌ అన్నాడీఎంకేపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు కూడా కమల్‌పై విరుచుకుపడ్డారు. ఆ సందర్భంలో కమల్‌కు స్టాలిన్‌ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు