నేడు కార్యదర్శులతో తలైవా భేటీ

12 Mar, 2020 06:55 IST|Sakshi
రజినీకాంత్‌

పెరంబూరు : నటుడు రజనీకాంత్‌ గురువారం మరోసారి రజనీ ప్రజా సంఘం రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా చెప్పి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన అభిమానుల హడావుడి మినహా రాజకీయ పార్టీని ప్రకటించిందిలేదు. రజనీకాంత్‌ కంటే కాస్త వెనుక తానూ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన ఆయన సహ నటుడు కమలహాసన్‌ పార్టీని నెలకొల్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించారు. ఆశాజనకమైన ఓట్లను సంపాదించుకున్నారు. నటుడు రజనీకాంత్‌ మాత్రం ఇప్పటికీ పార్టీని ప్రకటించలేదు. అయితే తాజాగా ఆయన రాజకీయపరంగా వేగాన్ని పెంచారని చెప్పాలి. గతవారం రాష్ట్రవ్యాప్త రజనీ ప్రజాసంఘం కార్యదర్శులను చెన్నైకి రప్పించి వారితో భేటీ అయ్యారు. దీంతో రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయం అని చాలామంది అనుకున్నారు. రాజకీయ వర్గాల్లోనూ కదలిక వచ్చింది. కార్యదర్శుల భేటీ అనంతరం రజనీకాంత్‌ చేసే ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే రజనీకాంత్‌ మాత్రం తానే మోసపోయానని  చెప్పి ఆయన అభిమానులతో పాటు, రజనీ పార్టీని ప్రకటిస్తే అందులోకి ఫిరాయిస్తామని ఎదురుచూసిన కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారూ నిరాశ చెందారు. అంతే కాదు తాను ముఖ్యమంత్రిని కాలేనని, అలాంటి ఆశ తనకు లేదని అన్న రజనీకాంత్‌ మాటలకు ఆయన అభిమానులు ఢీలా పడ్డారు. కాగా తన అభిప్రాయాన్ని మరో వారంలో వెల్లడిస్తానని చెప్పి అభిమానుల్లో కాస్త ఆశను మిగిల్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌ గురువారం మరోసారి కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉండడం, ఇటీవల కాంగ్రెస్‌ ఎంపీ తిరునావుక్కరసర్‌ వంటి కొందరు రాజకీయ నాయకులు రజనీకాంత్‌ను కలిసి చర్చలు జరపడం లాంటి పరిస్థితుల్లో గురువారం భేటీ అనంతరం రజనీకాంత్‌ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మహానాడులో పార్టీ పేరు ప్రకటన !
కాగా రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రకటన చేసిన తరువాత ఏప్రిల్‌ 14వ తేదీన మదురైలో భారీ మహానాడును ఏర్పాటు చేసి ఆ వేదికపై రజనీకాంత్‌ పార్టీ పేరును వెల్లడించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలా చేసి తన ప్రజా బలాన్ని చాటు కుంటే కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ వంటి పార్టీల వారు తనతో కూటమికి అర్రులు చాస్తారని భావిస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అన్నాడీఎంకే, డీఎంకే అసంతృప్తులు తన పార్టీ వైపు చూస్తారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించడానికి నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారని, పార్టీ పేరును కూడా నిర్ణయించారని, దాన్ని నమోదు కోసం గత వారమే ఆయన తరఫు న్యాయవాదులు ఢిల్లీలో పాగా వేశారని సమాచారం.

అయితే గురువారం తన కార్యదర్శులతో భేటీ అనంతరం ఆయన చేసే ప్రకటన చాలా కీలకం కానుంది. అందుకోసం ఇతర పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే గత వారంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో తాను కాస్త మోసపోయానని, అది ఏవిషయంలో అన్నది త్వరలోనే చెబుతానని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఆయన ఏ విషయంలో మోసపోయారన్నది ఇప్పటికే వెలుగులోకి వచ్చినా, దాన్ని రజనీకాంత్‌ గురువారం స్వయంగా చెప్పే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు