ఏపీ సీఎం స్ఫూర్తితో తలైవా పాదయాత్ర

10 Feb, 2020 08:02 IST|Sakshi

ఏపీ సీఎం స్ఫూర్తితో తలైవా పాదయాత్ర

8 ప్రాంతాల్లో మహానాడు

పెరంబూరు: తలైవా ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారా? అందుకు ప్రణాళికను రచించుకుంటున్నారా? అంటే అవునే సమాధానం వస్తోంది. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని అధికారికంగా ప్రకటించి రెండేళ్లు అవుతోంది. 2021 శాసనసభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. ఆ తరువాత ఇప్పటి వరకూ రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించలేదు. కానీ పలు చర్చలు, వివాదాలకు కారణంగా నిలుస్తున్నారు. ఆ మధ్య తూత్తుక్కుడి ఘటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల పెరియార్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. మరోపక్కసీఏఏ వంటి బిల్లులకు మద్దతు పలికి అన్నాడీఎంకే, బీజేపీలకు అనుకూలుడనే ముద్ర వేసుకున్నారు. అంతేకాదు తాజాగా రజనీకాంత్‌ భారతీయ జనతాపార్టీ గొంతు అనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయినట్లు సమాచారం. ఏప్రిల్‌లోనే పార్టీని ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై రజనీ ప్రజాసంఘంలోని కొందరు ప్రముఖులతోనూ, రాజకీయ సలహాదారులు, ఇతర సన్నిహితులతోనూ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో మహానాడు సభలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటిని ముందుగా మదురై, తిరుచ్చి జిల్లాల్లో మహానాడును నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని తలైవా నిర్ణయించుకున్నట్లు సమాచారం.  జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. అలా వారికి దగ్గరై ప్రేమాభిమానాలను పొందారు. అదేతరహాలో ప్రజల్లోకి వెళ్లాలని రజనీకాంత్‌ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పాదయాత్రతో నిరంతరం ప్రజల మధ్య ఉండాలా? లేక మహానాడు పేరుతో గ్రామాల్లో నిర్వహించే సమావేశాలలో పాల్గొని ప్రజలతో మమేకం కావాలా? అన్న విషయంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఏప్రిల్‌లో పార్టీని ప్రారంభించి, సెప్టెంబర్‌లో ప్రజల్లోకి వెళ్లాలని తలైవా నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్‌ ఇతర పార్టీలో పొత్తుకు సిద్ధమేననీ, అయితే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? అన్నది సందేహమేనని ఆయన రాజకీయ ఆలోచనాపరుడు తమిళరవి మణియన్‌ అన్నారు. రజనీకాంత్‌తో పొత్తుకు పాట్టాలి మక్కళ్‌ కట్చి వంటి పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

రజనీ పార్టీని పెట్టే అవకాశమే లేదు
రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ప్రారంభానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం ముమ్మరం అవుతున్న పరిస్థితుల్లో, ఆయనకు అంత సీన్‌ లేదని, పార్టీని పెట్టే అవకాశమేలేదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆదివారం కోవైలో మీడియాతో మాట్లాడారు. ఆయన రజనీకాంత్‌ రాజకీయ ప్రస్థానంపై స్పందించారు. రజనీ రాజకీయ పార్టీని పెట్టరని అన్నారు. నిజానికి రజనీకాంత్‌తో ఎప్పుడైనా రాజకీయ పార్టీని ప్రారంభం గురించి స్పష్టంగా చెప్పారా? అని ప్రశ్నించారు. తన నటిస్తున్న చిత్రం విడుదల సమయం వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీ ప్రస్థావన తీసుకొచ్చి తద్వారా ఆ చిత్రానికి ప్రచారాన్ని పొందుతున్నారని అన్నారు. అభిమానుల ఆదరణను కోలోపతున్న రజనీకాంత్‌కు రాజకీయ పార్టీని ప్రారంభించే సీన్‌ లేదని అన్నారు. తమిళరువి మణియన్‌ రజనీకాంత్‌ను ఆకాశానికి ఎత్తేసే పనిని మానుకోవాలని ముత్తరసన్‌ హితవుపలికారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు