పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్‌ నో..

21 Jan, 2020 11:53 IST|Sakshi

చెన్నై : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. తాను చదివిన వార్తాంశాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన వివరణ ఇచ్చారు. పెరియార్‌పై రజనీకాంత్‌ వ్యాఖ్యలపై ఓ రాజకీయ పార్టీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ తమిళ మేగజైన్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలతో జరిగిన ర్యాలీలో పెరియార్‌ పాల్గొంటే ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని వ్యాఖ్యానించారు. తుగ్లక్‌ పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు చో రామస్వామి ఒక్కరే ఆ వార్తను రాసి దాన్ని ఖండించారని గుర్తు చేశారు.

ఆ వార్త కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని కుదిపివేసిందని, ఆ మేగజైన్‌ కాపీలను ప్రభుత్వ అధికారులు సీజ్‌ చేయగా, చో రామస్వామి వాటిని పునర్ముద్రించగా హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయని చెప్పుకొచ్చారు. పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలన్న డ్రవిడార్‌ విదుతులై కజగం (డీవీకే) డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. తాను క్షమాపణ చెప్పనని, వార్తాంశాల్లో వచ్చిన విషయాల ఆధారంగానే తాను మాట్లాడానని అన్నారు. మరోవైపు రజనీకాంత్‌ క్షమాపణ చెప్పకుంటే థియేటర్లలో ప్రదర్శిస్తున్న ఆయన సినిమా దర్బార్‌ను అడ్డుకుంటామని డీవీకే హెచ్చరించింది. 

చదవండి : తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం

>
మరిన్ని వార్తలు