బాబ్రీ తాళాలు తెరిచింది రాజీవే : ఒవైసీ

5 Nov, 2019 11:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆదేశాల మేరకే బాబ్రీ మసీదు తాళాలు తెరిచారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. సోమవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన హోం శాఖ మాజీ కార్యదర్శి మాధవ్‌ గోడ్బోలే వ్యాఖ్యలే దీనికి సాక్ష్యాలని అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాద పరిష్కారానికి అప్పటి ఎంపీలు షాబుద్దీన్‌, మంత్రి కరణ్‌ సింగ్‌లు పలు సలహాలిచ్చినా వాటిని రాజీవ్‌ గాంధీ పెడచెవిన పెట్టారన్న మాధవ్‌ గోడ్బోలే వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఉటంకించారు.

అదే విధంగా పరిష్కార మార్గాల పట్ల రాజీవ్‌ ఎలాంటి ఆసక్తి చూపించలేదని ఒవైసీ వెల్లడించారు. మాధవ్‌ రాసిన పుస్తకంలో బాబ్రీ మసీదులో పూజలకు అనుమతించిన జిల్లా జడ్జి మొదటి కరసేవకుడిగా, రాజీవ్‌ గాంధీని రెండో కరసేవకుడిగా వర్ణించిన విషయం గుర్తు చేశారు. కాగా, అయోధ్య కేసులో దాదాపు 40 రోజులు రోజువారీ విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌ 17 వ తేదీలోగా తుది తీర్పు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

మరిన్ని వార్తలు