తేడా వస్తే తాట తీయండి..

28 Feb, 2019 04:53 IST|Sakshi
రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ సరిహద్దుల్లో జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాలపై భారత్‌ దాడి చేసిన అనంతరం దేశ భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ రాజీవ్‌ జైన్‌లతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్‌–పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ పాకిస్తాన్‌ దుశ్చర్యలకు పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టాలని హోం శాఖ ఆదేశించింది.  
ఇవిగో రుజువులు..

పుల్వామా దాడికి జైషే మహ్మదే కారణం
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో జైషే మహ్మద్‌ పాత్ర ఉందని చూపే ఆధారాలతోపాటు, పాక్‌లో నడుస్తున్న నిషేధిత ఉగ్ర సంస్థల వివరాలను భారత్‌ పాకిస్తాన్‌కు అందజేసింది.  ‘పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్‌ హస్తం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలతోపాటు ఆ ఉగ్ర సంస్థ నేతలు, స్థావరాల వివరాలను పాక్‌కు అందజేశాం’అని విదేశాంగ శాఖ తెలిపింది. పాక్‌ తన భూభాగంలో కొనసాగుతున్న ఉగ్ర కార్యకలాపాలను తక్షణమే అడ్డుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. 

అమెరికా చేసిన పని మనమూ చేయగలం
న్యూఢిల్లీ: భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను 2011లో అమెరికా దాడిచేసి మట్టుబెట్టిందని, భారత్‌కు అటువంటి సత్తా ఉందన్నారు. స్వచ్ఛగంగ ప్రచార కార్యక్రమంలో భాగంగా  ఢిల్లీ లో మాట్లాడారు. ‘ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాకో విషయం గుర్తుకొస్తోంది. అబోటాబాద్‌లోని రహస్య స్థావరంలో దాక్కొన్న లాడెన్‌ను అమెరికన్‌ నేవీ షీల్స్‌ చాకచ క్యంగా మట్టుబెట్టగలిగినప్పుడు మనమెందుకు ఆ పని చేయలేం? గతంలో ఇటువంటి దా డులు కేవలం మన ఊహలకు మాత్రమే పరిమితమయ్యేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది.  శత్రువు ఎక్కడున్నా మట్టుబెట్టే సామర్థ్యం భారత్‌కూ ఉంది’అని జైట్లీ అన్నారు.

మరిన్ని వార్తలు