భారత్ నౌకదళంలోకి ఐఎన్ఎస్ ఖండేరి

28 Sep, 2019 10:20 IST|Sakshi

సాక్షి, ముంబై: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి స్కార్పిన్‌ తరగతికి చెందిన మరో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ‘ఖండేరీ’  చేరింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో శనివారం దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ నేవీ అధికారులను ఉద్దేశించి ‘దేశం వారిపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా వ్యవహరిస్తారని తాను విశ‍్వసిస్తున్నా’  అని  ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు ఆయన ఈ సందర్భంగా వార్నింగ్‌ ఇచ్చారు. ఖండేరి లాంటి జ‌లాంత‌ర్గాముల‌తో పాక్‌కు గ‌ట్టి స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌మన్నారు. జమ్ము కశ్మీర్‌ అంశంపై భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు  లభిస్తోందని, అయితే పాకిస్తాన్‌ మాత్రం కావాలనే రచ్చ చేస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ దుయ్యబట్టారు.

శత్రు నౌకలకు అంతుచిక్కని ఖండేరి
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐఎన్‌ఎస్‌ ఖండేరీని 'సైలెంట్‌ కిల్లర్‌' అని కూడా పిలుస్తారు. శత్రు నౌకలకు అంతుచిక్కని ఖండేరి  పొడవు 67.5 మీటర్లు. శక్తిమంతమైన నాలుగు ఎంటీయూ 12వీ 396, ఎస్‌ఈ84 ఇంజిన్లు సొంతం.  సముద్ర ఉపరితలం నుంచి రోజుల తరబడి ఏకధాటిగా సముద్రంలో ప్రయాణించగల ఈ జలాంతర్గామిలో భారీ సామర్థ్యమున్న 360 బ్యాటరీలు ఉంటాయి.

కాగా 2017 డిసెంబరులో  ముంబైలో మజగావ్‌ డాక్‌ నౌకా నిర్మాణ కేంద్రం నుంచి ఖండేరి జలాంతర్గామిని  జల ప్రవేశం చేయించారు. శత్రువుల నిఘాకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ జలాంతర్గామి నుంచి శత్రు లక్ష్యాలపై విధ్వంసక దాడి చేయవచ్చు. అలాగే ట్యూబుల ద్వారా నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించవచ్చు. ఐఎన్‌ఎస్‌ ఖండేరీలో ఐదురుగురు నేవీ అధికారులుతో పాటు 35 మంది నావికా సిబ్బంది ఉంటారు.

ఖండేరీ... ఒకప్పటి మరాఠా దళం పేరు
17వ శతాబ్దంలో సముద్రంపై ఆధిపత్య పోరులో ప్రముఖ పాత్ర పోషించిన మరాఠా దళం ఖండేరీ పేరును దీనికి పెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ కంపెనీ నిర్మిస్తోన్న స్కార్పియో జలాంతర్గాములు డీజిల్‌–ఎలక్ట్రిక్‌ ఇంధనంగా పని చేస్తాయి. మజగవా డాక్స్‌లో ఆరు జలాంతర్గాములను తయారు చేస్తుండగా,  ఐఎన్‌ఎస్‌ ఖండేరీ రెండోది కావడం విశేషం.  ముంబయికి చెందిన మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఉష్ణ మండల ప్రాంతాల్లో కూడా ఏ సమస్యలు లేకుండా పనిచేస్తుంది. నౌకాదళంలోని ఇతర విభాగాల నుంచి కూడా ఆపరేట్‌ చేసేలా కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు