కశ్మీర్‌పై మీ ఏడుపు ఆపండి

30 Aug, 2019 04:40 IST|Sakshi
డీఆర్‌డీవో మేళాలో పాల్గొన్న రాజ్‌నాథ్‌

ఆర్టికల్‌ 370 రద్దు భారతదేశ అంతర్గత విషయం

పాకిస్తాన్‌కు స్పష్టం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

లేహ్‌: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఆ దేశం ఏడుపు ఆపాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాకిస్తాన్‌కు సూచించారు. కశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్‌కు ఒక విధానమంటూ లేదని, ఆ విషయంలో ఆ దేశం చేస్తున్న యాగీకి అంతర్జాతీయంగా ఏ దేశమూ మద్దతు ప్రకటించలేదని రక్షణ మంత్రి చెప్పారు. ‘నేను పాకిస్తాన్‌ను ప్రశ్నిస్తున్నా.. మీకేం సంబంధం ఉందని కశ్మీర్‌ విషయంలో రోదిస్తున్నారు? నిజానికి పాకిస్తాన్‌ ఇండియా నుంచి విడిపోయిన ప్రాంతమే. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, గిల్గిత్, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై రోదించండి’అని పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు.

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై అంతర్జాతీయంగా మద్దతు సంపాదించాలని పాకిస్తాన్‌ చేసిన కుటిల ప్రయత్నాలను ఏ దేశమూ సమర్థించలేదని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్‌–జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడారు. భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్న పొరుగు దేశంతో చర్చలు అసాధ్యమని ఆయన చెప్పారు. భారత్‌ పాకిస్తాన్‌తో సత్సంబంధాలనే కోరుకుంటోంది. అయితే పాకిస్తాన్‌ మొదట ఉగ్రవాదులను భారత్‌లోకి చొప్పించడం మానుకోవాలి. కశ్మీర్‌పై మాట్లాడేముందు వారు పీవోకే, బలూ చిస్తాన్‌పై మాట్లాడాలి అని రాజ్‌నాథ్‌ అన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్‌ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్‌లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు