ఇది భార‌త్‌కు మరింత బ‌లాన్నిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్‌

23 Apr, 2020 18:06 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వ‌చ్చిన మొబైల్ వైరాల‌జీ ల్యాబ్‌ వ‌ల్ల‌ క‌రోనా ప‌రీక్ష‌లు వేగ‌వంతం కానున్నాయ‌ని ర‌క్ష‌ణ‌శాఖ‌ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. అంతేకాక కరోనా వంటి ఇత‌ర రోగ‌కార‌కాల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపేందుకు ఇది ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌నుంద‌న్నారు. గురువారం ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడుతూ.. కేవ‌లం 15 రోజుల్లో బ‌యోసేఫ్టీ లెవ‌ల్ (బీఎస్ఎల్‌)-2, 3 ల్యాబ్‌ను రూపొదించ‌డాన్ని అభినందించారు. ఈ ల్యాబ్‌లో ఒక్క‌రోజులో 1000కి పైగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం ఉన్నందున క‌రోనాతో పోరాడేందుకు దేశానికి ఇది మ‌రింత బ‌లాన్నిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. (మే 3 తర్వాత విమాన సర్వీసులు నడుస్తాయా!)

డీఆర్‌డీవో వంటి ప‌లు ప్ర‌భుత్వ సంస్థ‌లు కోవిడ్‌-19 నివార‌ణ‌లో ముందుండి పోరాటం చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించారు. మ‌రోవైపు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం స‌కాంలో చ‌ర్య‌లు తీసుకున్నందున ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంద‌ని‌ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాగా నేడు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో ఎమ్‌వీఆర్‌డీఎల్‌(మొబైల్ వైరాల‌జీ రీసెర్చ్ అండ్ డ‌యాగ్న‌స్టిక్స్ లాబొరేట‌రీ) ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ మొబైల్ వైరాల‌జీ ల్యాబ్‌ను డీఆర్‌డీఓ త‌యారు చేసింది. అంతేకాక కరోనా నివార‌ణ కోసం వెంటిలేట‌ర్లు, పీపీఈ కిట్లు అందించ‌డంతోపాటు ఎన్నో ర‌కాలుగా డీఆర్‌డీఓ సాయం అందిస్తోంది. (హైదరాబాద్‌లో మొబైల్‌ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం)

మరిన్ని వార్తలు