తీర ప్రాంతంలో దాడి ముప్పు: రాజ్‌నాథ్‌

28 Sep, 2019 03:22 IST|Sakshi

కొల్లాం/న్యూఢిల్లీ: భారత్‌ పశ్చిమ తీరప్రాంతం వెంబడి పాకిస్తాన్‌ ఉగ్రదాడులకు దిగే అవకాశాలను కొట్టి  పారేయలేమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అయితే పాక్‌ ఎలాంటి దాడులకు పాల్పడినా తిప్పికొట్టడానికి తీరప్రాంత నిఘా దళాలు, నావికాదళ భద్రతా అధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేరళలో కొల్లామ్‌లో శుక్రవారం జరిగిన మాతా అమృతానందమయి 66వ పుట్టినరోజు ఉత్సవాలకు హాజరైన సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. ‘‘కచ్‌ నుంచి కేరళ వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంతం వెంబడి పొరుగు దేశం ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడులకు దిగొచ్చు. రక్షణ మంత్రిగా నేను గట్టి హామీ ఇస్తున్నాను.

పాక్‌ కుయుక్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా మన నావికా దళానికి ఉంది‘‘ అని అన్నారు. తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు పుల్వామా దాడులు జరిగాయని ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ఘటనతో భారత్‌ చేతులు ముడుచుకొని కూర్చోలేదని  బాలకోట్‌ వైమానికి దాడులకు దిగి పాక్‌కు గట్టి బుద్ధి చెప్పిందని అన్నారు. మనం ఎవరి జోలికి వెళ్లమని  కానీ అవతలి పక్షం ఆ పనిచేస్తే వారి అంతుచూస్తామని హెచ్చరించారు.  సైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోని దేశాలకు అంతర్జాతీయంగా గౌరవం లభించదని అన్నారు.  

పంజాబ్‌లో దొరికిన మరో పాక్‌ డ్రోన్‌
భారత్, పాక్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ఆయు ధాలను సరఫరా చేయడానికి వినియోగించిన ఒక పాకిస్తాన్‌ డ్రోన్‌ పంజాబ్‌లోని అటారిలో లభిం చింది.  పాక్‌ నుంచి ఆయుధాలు సరఫరాకి వచ్చిన ఈ డ్రోన్‌ సాంకేతిక లోపాలతో అటారి వద్ద కుప్పకూలిందని సీనియర్‌ పోలీసు అధికారి బల్బీర్‌ సింగ్‌ వెల్లడించారు. వరి పొలంలో గడ్డి కుప్ప మాటున ఎవరికీ కనిపించకుండా ఆ డ్రోన్‌ను దాచి ఉంచారు. గత 10 రోజుల్లోనే దాదాపుగా ఈ తరహాలో 8 డ్రోన్‌ ఘటనలు జరిగాయి. ఈ డ్రోన్లు 5 కేజీల బరువును మోసుకొని రాగలవు.

మరిన్ని వార్తలు