-

ఎంత మంది చచ్చారో రేపటికి తెలుస్తుంది : రాజ్‌నాథ్‌

5 Mar, 2019 19:19 IST|Sakshi

గువాహటి : బాలాకోట్‌లోని జైషే క్యాంపులపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారనే విషయంపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.  అసోంలోని ధుబ్రిలో బీఎఎస్‌ఎఫ్‌ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలకోట్‌లో ఎంత మంతి ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఐఏఎఫ్‌ దాడుల్లో ఎంత మంది చనిపోయారో చెప్పాలని కొంత మంది నేతలు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఈరోజు లేదా రేపటిలోగా సమాధానం లభిస్తుంది. పాకిస్తాన్‌ నాయకుల హృదయానికి మాత్రమే ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం తెలుస్తుంది. ఎంత మంది చచ్చారు అంటూ మనవాళ్లు పదే పదే అడగటం చూస్తుంటే.. మెరుపు దాడుల తర్వాత వైమానిక దళమే అక్కడికి వెళ్లి శవాలను లెక్కించాలని డిమాండ్‌ చేసేలా కనిపిస్తోంది’  అని ఎద్దేవా చేశారు.(దాడికి ముందు యాక్టివ్‌గా 300 మొబైల్ కనెక్షన్లు!!)

అధికారిక సంస్థ చెప్పినా నమ్మరా?
సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ముందు బాలాకోట్‌లో 300 మొబైల్‌ కనెక్షన్లు యాక్టివ్‌గా ఉన్నాయని జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్‌టీఆర్‌ఓ) చెప్పిన వివరాలను ప్రస్తావించిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. ‘ అధికారిక సంస్థ చెప్పినా కొంత మంది వ్యక్తులు నమ్మడం లేదు. చెట్లు కూలాయా అని ప్రశ్నిస్తున్నారు. చెట్లు మొబైల్‌ ఫోన్లు వాడతాయో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఎన్‌టీఆర్‌ఓ చెబుతుంది అబద్ధం అనిపిస్తే నా కాంగ్రెస్‌ స్నేహితులు పాకిస్తాన్‌కు వెళ్లవచ్చు. మన వైమానిక దళం ఎంతమందిని అంతమొందించారో అక్కడి వాళ్లను అడిగి.. వారే శవాలను లెక్కించవచ్చు’ అని విమర్శలు గుప్పించారు.(300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?)

మరిన్ని వార్తలు