‘ఇమ్రాన్‌ కార్టునిస్ట్‌లకు పని కల్పిస్తున్నారు’

28 Sep, 2019 12:02 IST|Sakshi

ముంబై: స్కార్పిన్‌ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ఖండేరి శనివారం నౌకాదళంలో చేరిన సంగతి తెలిసిందే. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రతి దేశం తలుపు తట్టి కార్టునిస్ట్‌లకు పని కల్పిస్తున్నారు తప్ప సాధించింది ఏం లేదంటూ ఎద్దేవా చేశారు. పాక్‌ కుట్రల్ని తిప్పి కొట్టగలిగే సామార్థ్యం భారత్‌కు ఉందని పేర్కొన్నారు. భారత తీర ప్రాంతాల్లో ముంబై తరహా దాడులు చేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తుందని... కానీ దాయాది దేశం కలలు నెరవేరవని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. పాక్‌ కుట్రల్ని భారత్‌ సైన్యం తిప్పికొడుతుందన్నారు.

ఖండేరి చేరికతో భారత నావికాదళం మరింత బలోపేతం అయ్యిందన్నారు. దేశ త్రివిధ దళాలలను మరింత శక్తివంతం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంటుందన్నారు రాజ్‌నాథ్‌. దేశంలో శాంతికి భగ్నం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులను భారత నావికా దళం సమర్థవంతంగా తిప్పికొడుతుందని తెలిపారు. సొంతంగా జలాంతర్గాములను తయారు చేసుకునే సామార్థ్యం ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు