యూపీని స్వీప్‌ చేస్తాం : రాజ్‌నాథ్‌

14 Jan, 2019 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఘోరపరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జోస్యం చెప్పారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీని స్వీప్‌ చేస్తామని, ఆ రాష్ట్రంలో గతంలో లభించిన 72 స్ధానాలను అవలీలగా తిరిగి దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు ఘనవిజయం కట్టబెట్టారని గుర్తుచేశారు. విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా యూపీలో 80 లోక్‌సభ స్ధానాలకు గాను 72 స్ధానాలు తగ్గకుండా బీజేపీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా యూపీలో బీజేపీకి చెక్‌పెట్టేందుకు దశాబ్ధాల తరబడి తమ మధ్య నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీ ఏకమైన సంగతి తెలిసిందే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చెరో 38 స్ధానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. మిగిలిన నాలుగు స్ధానాల్లో అమేథి, రాయ్‌బరేలి స్ధానాలను కాంగ్రెస్‌కు విడిచిపెట్టగా మరో రెండు స్దానాలను ఆర్‌ఎల్డీ వంటి పార్టీలకు అప్పగించనున్నాయి. మరోవైపు యూపీలో ఒంటరిపోరుకు కాంగ్రెస్‌ సంసిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు