పౌర చట్టంపై గడప గడపకూ బీజేపీ..

5 Jan, 2020 14:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఇంటికీ సీఏఏపై అవగాహన కల్పించే క్రమంలో దిగ్గజ నేతలు ఆయా ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పది రోజుల పాటు సాగే ఈ ప్రచారంతో 3 కోట్ల కుటుంబాలను బీజేపీ నేతలు కలుసుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పలు నగరాల్లో ర్యాలీలతో సీఏఏకు మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నించిన కాషాయ నేతలు తాజాగా ఇంటింటికీ తమ సందేశం చేరేలా కార్యాచరణ చేపట్టారు. హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం ఢిల్లీలో పలు గృహాలను సందర్శించి పౌర చట్టం ఉద్దేశాలను వివరించనుండగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కర్ణాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప, భోపాల్‌ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌లు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నోలో రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కేమ్‌కరన్‌ను ఆయన నివాసంలో కలిసి సీఏఏ ఉద్దేశాలను వివరించారు. విపక్షాలు సాగించే దుష్ప్రచారం నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విపక్ష పార్టీలు సీఏఏపై ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారని, ఈ చట్టం భారత పౌరులపై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. కులం, మతం ఆధారంగా తాము ఏ ఒక్కరిపై వివక్ష చూపబోమని, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్‌లలో మతపరంగా వివక్ష ఎదుర్కొంటూ వలస వచ్చిన మైనారిటీ శరణార్ధులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం కల్పిస్తామని వెల్లడించారు. ఇక బెంగళూర్‌లో ఇంటింటి ప్రచారం చేపట్టిన  కర్నాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప మాట్లాడుతూ సీఏఏపై కాంగ్రెస్‌ ముస్లింలలో గందరగోళం సృష్టిస్తోందని, ఈ చట్టం ద్వారా ఏ ఒక్క ముస్లింపై ప్రతికూల ప్రభావం ఉండదని చెప్పారు. ఇక భోపాల్‌లో ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌, పంచ్‌కులలా హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, జైపూర్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు సీఏఏపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు