రాజ్‌నాథ్‌ సింగ్‌ నిగూఢ వ్యాఖ్యలు

29 Sep, 2018 10:27 IST|Sakshi
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ :సర్జికల్‌ స్ట్రైక్స్‌’ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ‘పరాక్రమ్‌ పర్వ్‌’ పేరుతో ఆర్మీ ఎగ్జిబిషన్‌ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘గత రెండు మూడు రోజుల్లో మరో పెద్ద విషయం జరిగింది. ఇప్పుడే దీని గురించి ఏం చెప్పలేను.. కానీ భవిష్యత్తులో తెలుస్తుంది’ అన్నారు. కొన్ని రోజుల క్రితం ఎల్‌వోసీ దగ్గర పాకిస్తాన్‌ సైన్యాలు నాగేం‍ద్ర సింగ్‌ అనే సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ను కాల్చి చంపారు. ఈ సంఘటన నేపధ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌ స్థావరాలను నాశనం చేశారనే విషయం గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచనప్రాయంగా తెలియజేశారని విశ్వసనియ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఒక విషయం అయితే జరిగింది.. కానీ దాని గురించి ఇప్పుడేం ఏం చెప్పలేను. కానీ జరిగింది ఏదైనా మంచికే జరిగింది. నన్ను నమ్మండి. గడిచిన రెండు, మూడు రోజుల్లో చాలా గొప్ప విషయం ఒకటి జరిగింది. నిన్న, మొన్న ఏం జరిగిందనేది మీకు భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ నిగూఢంగా మాట్లాడారు.

‘నేను మన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌లకు ఒకటే చెప్పాను. ముందు పేలిన తూటా ఎప్పటికీ మనది కాకుడదు. వారు మన పొరుగువారు. కానీ వారు కాల్పులకు తెగబడితే మాత్రం ఊరుకోకండి. విజృంభించండి అని చెప్పాను’ అని వివరించారు. పాక్‌ సైన్యం నాగేంద్ర సింగ్‌ని అతి క్రూరంగా చంపేసినందుకు ప్రతీకారంగా బీఎస్‌ఎఫ్‌ కొన్ని చర్యలు తీసుకున్నట్లు.. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు